కేటీఆర్ లీగల్ నోటీసు …. సంజయ్ సీబీఐ విచారణకు సవాల్

ఈనెల 11వ తేదీన ట్విట్టర్ వేదిక ద్వారా తాను చేసిన ఆరోపణలపై  రాష్ట్ర ఐటీ, మన్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను ప్రజల తరపున పోరాడుతున్నానని, వాస్తవాలే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘నీకు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే… ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయ్.. ’’ అని ఎదురు  సవాల్ విసిరారు.
 ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వ రోజు పాదయాత్ర చేస్తున్న సంజయ్ శుక్రవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం వద్ద మీడియాతో మాట్లాడుతూ  “మీ నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ కు చెందిన 27 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ పాపం ఒట్టిగ పోతదా? ద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధ చెప్పుకోవడానికి పోతే లాఠీఛార్జ్ చేయించిన దుర్మార్గపు కుటుంబం మీది” అంటూ తన ఆరోపణలను తిరిగి చేశారు.
 
“వాస్తవాలే మాట్లాడుతున్నా.. నువ్వు ఐక్య రాజ్యసమితి పోయి నోటీస్ ఇచ్చుకో…నామీద దావా వేసే ముందు గ్లోబరీనా సంస్థకే ఆయనకున్న సంబంధమేంటో చెప్పాలి. మీరు ఉద్యోగాలివ్వకపోవడంవల్ల వందల సంఖ్యలో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వాళ్ల చావులకు నువ్వు, నీ అయ్యనే కారణం. ఇయ్యి లీగల్ నోటీస్…” అంటూ మండిపడ్డారు.
 
“ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, గుండె ఆగిన కార్మికుల చావులకు నీ అయ్యనే కారణం… ఇయ్యి లీగల్ నోటీస్…317 జీవోతో ఇంటికొకరు పుట్టకొకరు అయి చాలామంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇయ్యి లీగల్ నోటీస్. వరి వేస్తే ఉరే అన్న ప్రకటనతో వరి కల్లాల మీద తనువు చాలించిన రైతుల చావులకు నీ అయ్యే కారణం… ఇయ్యి లీగల్ నోటీస్… ” అంటూ కేసీఆర్ ప్రభుత్వ అరాచకాల చిట్టా విప్పారు. 
“అసలు మీ మీద 420 కేసు పెట్టాలి. దళితుడిని సీఎం చేస్తానన్నవ్. దళితులకు మూడెకరాలు ఇస్తానన్నావ్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగ భ్రుతి ఇస్తానన్నావ్. రైతులకు రుణమాఫీ అన్నావ్. ఇంటికో ఉద్యోగమిస్తానన్నవ్. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీలిచ్చి మోసం చేశావ్. మీ మీద 420 కేసు పెట్టాలి” అంటూ సంజయ్ ఎదురు దాడి చేశారు.
 
“నీకు గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయ్.. నీ సంగతి అంతా తెలుసు. మీకు, యూఏఈలో ఉన్న బీఆర్ శెట్టితో ఉన్న సంబంధమేంటో అన్నీ తెలుసు. ఆ లింకులన్నీ బయటకు తీస్తున్నం. మీ సంగతి తేలుస్తాం…”  అంటూ కేటీఆర్ పై వరుసగా ఆరోపణలు చేశారు.  
“నువ్వెన్ని లీగల్ నోటీసులిచ్చినా భయపడే ప్రసక్తే లేదు. నీకు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే… ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయ్..’’ అని సవాల్ విసిరారు.