అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం

రానున్న ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణాలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీకి కట్టుబడి వాటిని అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.  ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశ విజయవంతం కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు.  అమ్మవారి ఆశీర్వాదంతోనే ప్రజా సంగ్రామయాత్ర విజయవంతం అయిందని చెప్పారు.
31 రోజుల్లో 383 కిమీ పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. త్వరలో మూడోవిడత ప్రజా సంగ్రామయాత్ర చేపడతామని సంజయ్‌ చెప్పారు.  ముగింపు సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రావడంతో ప్రతి కార్యకర్తల్లో జోష్ వచ్చిందని తెలిపారు.  ముగింపు సభకు లక్షలాదిగా ప్రజలు, బిజెపి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని చెబుతూ అమిత్ షా సందేశం బిజెపిని విమర్శలు చేసే కొన్ని రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిదని సంజయ్ చెప్పారు.
పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నామని చెబుతూ ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు.  ఎంతోమంది ప్రజలు పేదరికంలో గుడిసెల్లో జీవిస్తున్నామని, లక్షల మందికి ఇండ్లు కూడా లేని పరిస్థితి నెలకొన్నదని పేర్కొంటూ బిజెపి అధికారంలోకి రావాలని పెద్దలందరూ కోరుకొంటున్నామని సంజయ్  చెప్పారు.
 
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తుతూ బీజేపీ అధికారంలోకి రాగానే  నిలువనీడలేని అర్హులైన నిరుపేదలు అందరికి పక్కా ఇల్లు నిర్మిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.  కేసీఆర్ ఇంటికో ఉద్యోగం హామీ ఆటకెక్కిందని విమర్శిస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేస్తామని సంజయ్ వెల్లడించారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని తెలిపారు. 
 
 తెలంగాణాలో వ్యాట్ తగ్గించకుండా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారన్న సంజయ్ బిజేపీ అధికారంలో వచ్చాక వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తామని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ వ్యాట్‌పై కేసీఆర్ కమిషన్ తీసుకుంటున్నాడని ఆరోపించారు. 
ఏడేళ్లుగా నష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడుతూ వారికి ఫసల్ భీమా యోజన ద్వారా మేలు చేస్తామని చెప్పారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ,  కోటీశ్వరుడు అవుతుంటే రాష్ట్రంలోని రైతులు మాత్రం కేసీఆర్ నిర్ణయాలతో బికారులు అవుతున్నారని సంజయ్ ధ్వజమెత్తారు.  కేసీఆర్ రైతులను అరిగోస పెడుతున్నాడని అంటూ కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.  నీళ్లు,నిధులు, నియామకాలలో న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే అని పిలుపిచ్చారు.
 
ఇక 4 శాతం మైనారిటీ రిజర్వేషన్ తొలగించి ఎస్సీ, ఎస్టీ, బిసీ లకు అందిస్తామని సంజయ్ ప్రకటించారు. తెలంగాణాలో ఆకు పచ్చ జెండాలను తొలగించి రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మారుస్తామని భరోసా ఇచ్చారు. నికార్సైన తెలంగాణవాదులు అమిత్ షా సభను విజయవంతం చేశారని, ఆకుపచ్చ తెలంగాణ కోసమే ప్రజా సంగ్రామయాత్ర చేపట్టినట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.