రేపే ఎన్నికలకు వెళ్లినా మేం సిద్ధం, గెలుస్తాం… అమిత్ షా

.కేసీఆర్‌‌‌‌ ముందస్తు ఎన్నికల కోసం ఫామ్​హౌస్‌‌‌‌లో కూర్చొని ప్రణాళికలు రచిస్తున్నారని, రేపే ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ భరోసా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో దశ  ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద శనివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో నయా నిజాం కేసీఆర్​ను గద్దె దించేందు కు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తన జీవితం లో ఇంతటి పనికిమాలిన, ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని చెబుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.  టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని ధ్వజమెత్తుతూ  టీఆర్ఎస్, మజ్లిస్‌ను ఒకేసారి విసిరేయాలని ప్రజలకు  షాపిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని బెంగాల్‌లా మారుద్దామని కేసీఆర్ భావిస్తున్నారని షా విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ మజ్లిస్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, ఆ పార్టీ అంటే కేసీఆర్‌కు భయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు తాను అవసరం లేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం చేసిన యాత్ర అని అన్నారు.

రాష్ట్రంలోని నిరంకుశపాలనను అంతమొందించడం కోసం  జరిగిన యాత్ర అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, రాష్ట్రంపై అందరికీ సమానహక్కు ఉందని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారని షా మండిపడ్డారు.

తెలంగాణ మారాలా? వద్దా? అని ప్రశ్నించిన షా.. హైదరాబాద్ నిజాంను మార్చేందుకే యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు అందించారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే వాటిని అమలుచేసి చూపిస్తామని స్పష్టం చేశారు. 
 
దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న కేసీఆర్ వాగ్దానం ఏమైపోయిందని నిలదీశారు. హైదరాబాద్‌లో కొత్తగా 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తామని కేసీఆర్ అంటున్నారని, ఒకసారి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పరిస్థితి ఏంటో చూడాలని అమిత్ షా ప్రజలను కోరారు.
తెలంగాణ ప్రజలకు తెలియదని కేసీఆర్ అనుకుంటున్నారు.. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదని అంటూ  ఎందుకంటే వాటిలో ఆయన కాంట్రాక్టులు ఉండటం లేదని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాల్లో  రూ. 2.50 లక్షల  కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చామని సభలో అమిత్ షా ప్రకటించారు.
బీజేపీ తన సిద్ధాంతాలతో ప్రజల వద్దకు వెళ్తుందని, అయితే బీజేపీ కార్యకర్తలను పట్టపగలే హత్య చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ తెలంగాణ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతూ  దీనిని ఆపాలని స్పష్టం చేశారు. సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతూ ఈ ఘటనలో ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. 
దళితులతో పాటు అన్ని వర్గాల వాళ్లను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లులు, రైతులకు రుణమాఫీ అమలు కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. అందుకే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు యువత సిద్ధంగా ఉందని తెలిపారు.  హైదరాబాద్‌ నిజాంని మార్చాల్సిన అవసరం ఉందా? లేదా? అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మరోసారి గట్టిగా ప్రశ్నించారు. 

సర్పంచ్‌కు కూడా అధికారం ఇవ్వకుండా.. కొడుకు, బిడ్డకు అధికారం కట్టబెట్టారని కేసీఆర్‌పై అమిత్ షా  మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందని అంటూ  ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని పక్కనపెట్టారని ధ్వజమెత్తారు. మజ్లిస్‌కు మీరు భయపడతారేమో.. మేం భయపడం అని టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ అమిత్‌ షా స్పష్టం చేశారు. మన ఊరు-మన బడి నిధులు కేంద్రానివే. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చిత్రీకరించారు.

ఆయుష్మాన్‌భవ లాంటి వాటిని తెలంగాణలో నడిపించడం లేదన్నారు అమిత్‌ షా.  బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్‌ అది చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని శత్రువుగా భావించకండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అమిత్‌ షా. అధికారమిస్తే ప్రతీ గింజను కొంటామని, సంక్షేమ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. 

త్వరలోనే నిధులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయని అమిత్‌ షా భరోసా ఇచ్ఛారు. అవకాశం ఇస్తే.. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌తో అభివృద్ధి చేసి చూపిస్తాం అని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రభుత్వం తెలంగాణకు అవసరమా? అని నిలదీశారు.  సచివాలయానికి వెళ్లలేని కేసీఆర్‌ను ప‍్రజలే గద్దెదించుతారని షా అమిత్ షా స్పష్టం చేశారు.