పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కేంద్రంపై దాడిలో ఐఎస్ఐ 

పంజాబ్‌లోని మొహాలీలో పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై సోమవారం జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్  దాడి వెనుక పాకిస్థానీ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) హస్తం ఉన్నట్లు వెల్లడైంది. ఐఎస్ఐ ఆదేశాలతో కెనడా కేంద్రంగా పనిచేస్తున్న  ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ), స్థానిక గ్యాంగ్‌స్టర్స్ లఖ్బీర్ సింగ్ అలియాస్ లండ ఈ దాడికి పాల్పడినట్లు బయటపడింది.
అతనే స్థానిక నేరస్థలకు ఈ దాడికి పాల్పడడానికి అవసరమైన ఆర్ పి జి, ఎకె -47 సమకూర్చిన్నట్లు కనుగొన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.  పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) వీకే భవ్రా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
లక్బిర్ సింగ్ లండా ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని చెబుతూ  పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండాకు లక్బిర్‌ సన్నిహిత సహచరుడని తెలిపారు.  తరన్ తరన్‌లో ఉంటున్న నిషాన్ సింగ్, చాదత్ సింగ్‌లతో కలిసి లండా ఈ దాడికి పాల్పడినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
దాడికి పాల్పడిన వారికి, వారికి సహాయపడిన వారికి నిధాస్ సింగ్ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినట్లు చెప్పారు. లండా చెప్పిన చోటు నుంచి నిషాన్ సింగ్ ఆర్ జి పి ని  తీసుకుని, దాడికి పాల్పడిన వారికి అందజేశాడని చెప్పారు. తరన్ తరన్‌లో ఉంటున్న బల్జిందర్ సింగ్ రాంబో ఏకే-47 రైఫిల్‌ను తీసుకుని, చాదత్ సింగ్‌కు అందజేశాడని వివరించారు.
చాదత్ సింగ్, మరో ఇద్దరితో కలిసి తరన్ తరన్ నుంచి మే 7న బయల్దేరి వెళ్ళాడని, రెండు రోజుల అనంతరం (మే 9న) మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేశారని చెప్పారు. వీరందరికీ మొహాలీలో ఉంటున్న జగదీప్ సింగ్ సహకరించాడని తెలిపారు. చాదత్ సింగ్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నోయిడాలో నివసిస్తున్న, బిహార్‌కు చెందిన మహమ్మద్ అసీం ఆలం, మహమ్మద్ సరఫ్‌రాజ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.