కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్ ను చంపిన ఉగ్రవాదులు

కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్ ను చంపిన ఉగ్రవాదులు
పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్‌ ఒకరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం అతనిని ఇంటి వద్దే కాల్చిచంపారు. దీంతో గత 24 గంటల్లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వారి సంఖ్య రెండుకు చేరింది.  ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ను రెయాజ్ అహ్మద్ థోకెర్‌గా గుర్తించారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెయాజ్ కన్నుమూసినట్టు కశ్మీర్ జన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
 
దీనికి ముందు, గురువారం సాయంత్రం బుద్గాం జిల్లా ఛదూరలోని తహసిల్ కార్యాలయంలో పనిచేస్తున్న కశ్మీర్ పండిట్‌ రాహుల్ భట్‌ను ఆఫీసు ఆవరణలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు శ్రీనగర్-బుద్గాం హైవేను దిగ్బంధించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. 
 
ఈ ఘటన సిగ్గుచేటంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. జమ్మూలోని ఆయన స్వస్థలం దుర్గా నగర్‌కు ఆయన మృతదేహం చేరుకునేసరికి ఆయన బంధువులు ఓదార్చడం సాధ్యం కాని స్థాయిలో విలపించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వీరు బడ్గాంలోని షేక్‌పొర మైగ్రంట్ కాలనీలో నివసిస్తున్నారు. 
బంటలాబ్ శ్మశాన వాటికలో ‘‘రాహుల్ భట్ అమర్ రహే’’ నినాదాల మధ్య ఆయన మృతదేహానికి ఆయన సోదరుడు సన్నీ  అంత్యక్రియలు నిర్వహించారు.  కశ్మీరు లోయలో శాశ్వతంగా స్థిరపడాలన్న తమ కలలను ఈ సంఘటన దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాహుల్ భట్ తండ్రి బిటా భట్  దుర్గానగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడి హత్యకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, పకడ్బందీగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ తల్లి బబ్లి మాట్లాడుతూ, తన కుమారుడిని తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.