కర్ణాటకలో రాత్రిపూట లౌడ్ స్పీకర్లపై నిషేధం 

లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన వారు తప్ప లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
 
మరోవంక, రాష్ట్ర వ్యాప్తంగా లౌడ్‌స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి పొందని ధార్మిక సంస్థలకు నోటీసులు జారీ చేసేందుకు హోం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. లౌడ్‌స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సూచించిన నేపథ్యంలో తగు చర్యలకు సమాయత్తమయ్యారు. 
 
రాజధాని బెంగళూరు సహా మైసూరు, తుమకూరు, శివమొగ్గ, దావణగెరె, కోలారు, మంగళూరు, బెళగావి, కలబురగి, బళ్లారితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 121 దేవాలయాలు, 83 మసీదులు, 22 చర్చిలు, మరికొన్ని ఇతరత్రా కలిపి మొత్తం 301 ధార్మిక సంస్థలకు నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటితోపాటు పెద్దపెద్ద శబ్ధం వచ్చే సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న బార్లకు కూడా నోటీసులు జారీ చేయనున్నారు. 
 
ప్రార్థనా మందిరాలు ఏ మతానికి చెందినవైనా సరే అనుమతులు లేకుండా లౌడ్‌స్పీకర్లు ఉన్నచోట నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ ప్రవీణ్‌సూద్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు వేర్వేరు డెసిబల్స్‌ ప్రమాణాలను ప్రార్థనామందిరాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని, అనుమతి ఉన్న లౌడ్‌స్పీకర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని డీజీపీ ప్రవీణ్‌సూద్‌ మీడియాకు తెలిపారు.
మహారాష్ట్రలోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ మహా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లౌడ్ స్పీకర్లపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది.
మే 3వతేదీలోగా మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఏప్రిల్ 12న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎన్ఎస్ చీఫ్ అల్టిమేటం ఇవ్వడంతో లౌడ్ స్పీకర్ల గొడవ మొదలైంది. లేని పక్షంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపిస్తారని హెచ్చరించారు. ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించే ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసాను ప్లే చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో రాజ్ థాకరేపై మంగళవారం కేసు పెట్టారు.