
“ఈ చట్టం విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. మా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏంటో కూడా న్యాయస్థానానికి తెలియజేశాం. న్యాయస్థానాలను, వాటి స్వతంత్య్ర హోదాను మేం గౌరవిస్తాం. కానీ, అంతా లక్ష్మణ రేఖను గౌరవించాలి. అంతేగానీ దాటకూడదు కదా” అంటూ కిరెన్ రిజిజు మీడియాతో చెప్పారు.
ఇప్పటికే ఈ చట్టం కింద నమోదైన కేసుల గురించి ఎలాంటి వైఖరి అనుసరించబోతుందో స్పష్టం చేయాలని కోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణఇస్తూ సమీక్ష పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయొద్దనేది సరైన విధానం కాదని పేర్కొన్నారు.
తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేమని స్పష్టం చేశారు. ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని, కొన్ని ఉగ్రకోణంలో ఉండొచ్చు.. మరికొన్ని మనీలాండరింగ్ కేసులు కావొచ్చని తెలిపారు. అయితే ఈ కేసులను పరిశీలించేందుకు ఎస్పీ ర్యాంక్ అధికారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఎస్పీ ర్యాంకు అధికారి నేర తీవ్రతను పరిశీలించి ఆమోదిస్తే కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని కోర్టుకు తుషార్ మెహతా తెలిపారు. పెండింగ్ కేసులను న్యాయపరమైన ఫోరమ్ ముందు పరిశీలించాలని వివరించారు.
అయితే కేంద్రం వాదనతో సీజేఐ జస్టిస్ ఎన్ .వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారని తెలిపింది.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం