మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి  నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సీఐడీ అధికారులు  కొండాపూర్‌లోని నివాసంలో నారాయణను అదుపులోకి తీసుకుని చిత్తూరుకు ఆయన భార్య రమాదేవితో సహా తరలిస్తున్నారు.
 
పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో నారాయణ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి మాజీ మంత్రి నారాయణ ప్రోద్భలంతోనే పేపర్‌ లీక్‌ చేసినట్లు పేర్కొన్నట్లు తెలుస్తున్నది. గిరిధర్‌ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు  నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. 
 
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇప్పటిదాకా 60 మందిని అరెస్ట్ చేశామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.  ప్రశ్నపత్రం ఎక్కడ లీకైందో అధికారులు విచారణ చేస్తున్నారని చెబుతూ అరెస్టయిన వాళ్లు తప్పు చేయలేదని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. అక్రమాలు జరగకుండానే ఎందుకు అరెస్ట్ చేస్తామని ప్రశ్నించారు.
ఇలా ఉండగా, నారాయణపై సోమవారం సాయంత్రమే రెండో  నిందితుడిగా పేర్కొంటూ అమరావతి భూముల కుంభకోణంలో మరో కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. మంగళగిరి వైసిపి ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై ఏపీ సిఐడి ఈ కేసు నమోదు చేశారు.
స్వప్రయోజనాల కోసం రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపణలు వస్తున్నాయి. అలైన్‌మెంట్‌ మార్పుతో రామకృష్ణ హౌసింగ్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, ఎల్ఇపిఎల్ ప్రాజెక్ట్స్‌, లింగమనేని అగ్రికల్చర్‌ ఫామ్స్‌, జయని ఎస్టేట్స్‌కు లబ్ధి కలిగించారని ఆరోపణలు చేశారు.ఈ కేసులో ఎ-1 చంద్రబాబు నాయుడు, ఎ-2 నారాయణ, ఎ-3 లింగమనేని రమేష్, ఎ-4 లింగమనేని శేఖర్ పేర్లను సిఐడి చేర్చింది.
2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదైంది. సీఆర్డీఏ విషయంలో చేతివాటం ప్రదర్శించారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ లో మొత్తం 14 పేర్లను చేర్చినట్టు సిఐడి అధికారులు వెల్లడించారు.
 
 ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పట్నుంచీ లీకుల బెడద ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే ఈ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల పాత్ర కూడా ఉందని గత కొన్ని రోజలుగా వార్తలు వచ్చాయి.  గత వారం తిరుపతిలో జరిగిన ఓ సభలో పరీక్షా పాత్రలను నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల వారే లీక్ చేతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
పదో తరగతి పరీక్షల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌లో టెన్త్ ప్రశ్నా పత్రం లీకేజీ వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి లీకేజీలో పాత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఉదయం పరీక్ష ప్రారంభమైన వెంటనే గిరిధర్ వాట్సప్ నంబర్ నుంచి తెలుగు ప్రశ్నా పత్రం బయటకు వెళ్లిందని పోలీసులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9.57కి ప్రశ్నాపత్రం లీకైందన్నారు. ఇదే కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.
 
ఆయన నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలోనే నారాయణను అదుపులోకి తీసుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. టిడిపి ప్రభుత్వంలో మునిసిపల్ మంత్రి ఆయన పనిచేశారు.  గత 4 రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు.
కాగా, మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీవ్రంగా ఖండించారు.  ‘‘వంక లేని వాడు డొంక పట్టుకుని ఏడ్చాడు అన్నట్లు ఉంది ఏపీ ప్రభుత్వ వ్యవహారం’’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు అరికట్టలేక వైసీపీ నేతలు చేస్తున్న లీకేజీలను టీడీపీకి అంటగట్టాలని చూస్తోందని ఆరోపోయించారు.  వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనమని  ఆగ్రహం వ్యక్తం చేశారు.