కామారెడ్డి రోడ్ ప్రమాద బాధితులకు ప్రధాని సాయం 

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ప్రధాని కార్యాలయం (పిఎంఓ) తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపినట్లు పేర్కొంది. 
 
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు పిఎంఓ కార్యాలయం చెప్పింది. అలాగే, గాయపడిన వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు ట్వీటర్ ద్వారా ప్రకటించింది.
 
 అన్నసాగర్ తండా వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న ట్రాలీ ఆటో  లారీ వేగంగా వచ్చిఢీ తొమ్మొది మంది దుర్మరణం పాలవ్వగా, మరో 17మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
 
పోలీసులు, స్థానిక కథనం మేరకు  పిట్లం మండలం చిల్లర్గికి చెందిన సౌదర్‌పల్లి మాణిక్యం గత గురువారం మరణించాడు. దశదినకర్మ అనంతరం ఆచారం ప్రకారం… వారి కుటుంబ సభ్యులను మొత్తం 25 మంది ఆదివారం టాటాఎస్‌ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతలో అంగడిదింపుడు కార్యక్రమానికి తీసుకెళ్లారు.
 
 తిరుగుప్రయాణంలో వీరి వాహనాన్ని డ్రైవర్‌ అతివేగంగా నడిపి  నిజాంసాగర్‌ మండలం హసన్‌పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్‌ రోడ్డుకిందకు దూసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. డ్రైవర్‌ సాయిలు (25), లచ్చవ్వ (45) అక్కడికక్కడే మృతి చెందారు. 
 
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు తరలించారు. అక్కడ అంజవ్వ (40), వీరమణి (38), సాయవ్వ (40) మరణించారు. కొందరిని నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ వీరవ్వ (70), గంగామణి (45) మృతి చెందారు. 
 
బాన్సువాడ ఆసుపత్రి నుంచి నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా ఎల్లయ్య (45), పోచయ్య (44) దారిలోనే చనిపోయారు. టాటాఎస్‌ వాహనాన్ని డ్రైవర్‌ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని బాధితులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది మృతి చెందడం బాధాకరమ‌ని క‌విత తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు.