కేటీఆర్ చెప్పేవన్నీ డ్రామాలే..

రాష్ట్ర మంత్రి కేటీఆర్ నారాయణపేటలో చెప్పినవన్నీ అబద్ధాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతోసహా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని తేల్చి చెప్పారు. దీనిపై చర్చకు సిద్ధమని మరోసారి సవాల్ విసిరారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి ఒక్కో తలపై రూ.లక్ష అప్పు మోపారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మూటాముల్లె సర్ధుకుని విదేశాలకు పారిపొయేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 26వ రోజు జడ్చర్ల నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర సందర్బంగా పెద్ద ఆదిరాల గ్రామంలో సాయంత్రం రచ్చబండ నిర్వహించారు. 
 
గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. నైట్ క్వార్టర్ కేమో రూ.80లు… లీటరు పాలకు రూ.25. మేమెలా బతుకుతామని గ్రామానికి చెందిన రైతు ప్రశ్నించారు.  3 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు, ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేక పోయారని, స్కూల్ లో స్కావేంజర్స్ ని కూడా తీసిపడేశారని సర్పంచ్ భర్త ఆవేదన వ్యక్తం చేశారు.
 
 గ్రామంలో రోడ్లు అతుకుల గుంతలా ఉన్నాయని, బస్సును నడిపించే పరిస్థితి లేదని వాపోయారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, పెన్షన్స్, ఉపాధి, ఏమి లేవని స్థానిక మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ కుటుంబం రోజు కష్టపడి పనిచేసి రూ.600 సంపాదిస్తే… కేసీఆర్ కే రూ.500 (లిక్కర్) పోతున్నాయంటూ వారంతా వాపోయారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని చెబుతూ కేసీఆర్ ప్రభుత్వం ఆ బియ్యం ఎందుకు పేదలకు ఇవ్వడం లేదో నిలదీయండని సంజయ్ చెప్పారు.  ప్రజలను ఎట్లా మోసం చేయాలనే ఆలోచనే తప్ప మంచి చేయాలనే ఆలోచనే కేసీఆర్ కు లేదని అంటూ పేదలంటే కేసీఆర్ కు చులకన అని దుయ్యబట్టారు.
 
తెలంగాణకు 1.4 లక్షల ఇండ్లను మోదీ ప్రభుత్వం కేటాయిస్తే కేసీఆర్ పేదలకు ఏడేళ్లుగా ఒక్క ఇల్లు కట్టివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను మాత్రం 100 గదులతో ప్రగతి భవన్ కట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.  కరెంట్ బిల్లులు పెంచిండు.. బిల్లును చూస్తేనే షాక్ కొట్టేలా చేసిండు.. పొలం కాడ ఫ్రీ కరెంట్ అన్నడు..ఇంటికాడ బాదుతుండని విమర్శించారు.
 
పెట్రోలు ధరలపై కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ వ్యాట్ పేరుతో ఒక్కో లీటర్ పై రూ.30లు దొబ్బుతున్నడని ఆరోపించారు. 
 గ్రామాల్లో అమలవుతున్న వైకుంఠధామాలు, మరుగుదొడ్లు, పల్లె ప్రక్రుతి వనాలు, రైతు వేదికలుసహా అన్ని అభివ్రుద్ది పథకాలకు కేంద్రమే నిధులిస్తోందని స్పష్టం చేశారు.
తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనేందుకు సిద్ధంగా ఉన్నా… రైతులను అరిగోస పెడుతూ ఆ నేరాన్ని మోదీపై నెట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లోకి వస్తే… ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీయండని సంజయ్ పిలుపిచ్చారు.