300 కిలోమీటర్ల మైలురాయి దాటిన సంజయ్ యాత్ర

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం 300 కిమీ మైలురాయి దాటింది.  ఏప్రిల్‌ 14న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో మొదలయిన ఆయన పాదయాత్ర అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో కొనసాగింది. 
 
జడ్చర్ల సమీపంలోని గంగాపురం వద్దకు చేరుకునే సరికి 300 కిలోమీటర్లు పూర్తవడంతో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.  సంజయ్‌తో 300 కిలోల కేక్‌ కోయించారు. ప్రజల ఆశీర్వాదంతోనే మండుటెండలో సైతం యాత్ర చేయగలిగానని సంజయ్‌ చెప్పారు.
ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో కొనసాగింది. కోడ్గల్‌ గ్రామంలో రాత్రి రచ్చబండ నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ మాట్లాడారు.  ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నారని, దీంతోపాటు గ్రామ పంచాయతీలకు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇస్తున్నారని తెలిపారు. అయితే,  ఆ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన  ఖాతాలో జమచేసుకుంటున్నారని ఆరోపించారు.
మోదీ నిధులు ఇచ్చినా, పంచేవాడు మనవాడు కాకుంటే లబ్ధిదారులకు అవి ఎలా చేరతాయని ఆయన ప్రశ్నించారు.
 అందుకే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారని చెప్పారు. గజ్వేల్‌ నుంచి ఇక్కడికి వచ్చి, దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఈ ప్రాంతంలో సెజ్ సహా అనేక ఫ్యాక్టరీలున్నప్పటికీ ఇక్కడి స్థానికులకు మాత్రం ఉద్యోగాలివ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూం ఇండ్లు టీఆర్ఎస్ లీడర్లకే కేటాయిస్తున్నారని, జడ్చర్ల మండలంలోని కోడుగల్ లో ఒక్క టీఆర్ఎస్ లీడర్ ఇంటికే ఏకంగా 10 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని ధ్వజమెత్తారు.
 
 తండాల్లో రోడ్లు, గుడి, బడి, లైట్లు లేవు. అభివ్రుద్ధి లేదు. కనీస సౌకర్యాల్లేవు. గొర్లు, చేపల పంపిణీ పేరుతో ఊరించి ఎన్నికల్లో లబ్ది పొందాక వాటిని పంపిణీ చేయడం లేదు. పైగా ముదిరాజ్ లపై కేసీఆర్ కక్ష కట్టి వేధిస్తున్నరని సంజయ్ మండిపడ్డారు. ఈ మండలంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తానని హామీ ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 
పేదల రాజ్యం రావాలి. గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టాలని చెబుతూ పేదల రాజ్య స్థాపన కోసమే పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు.  దళితులు, పేదలుసహా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.  ఇప్పటి వరకు అన్ని పార్టీలకు అవకాశమిచ్చారు. టీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండని సంజయ్ కోరారు.