పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్న కేసీఆర్

కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
ప్రజా సంగ్రామ యాత్ర 24వ రోజు శనివారం జడ్చర్ల అంబెడ్కర్ సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 6 కిలోలకు అదనంగా కేంద్రం పేదలకు 5 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తోందని చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం 6 కిలోలు మాత్రమే ఇస్తూ  ఒక్కో పేదకు ఇవ్వాల్సిన 5 కిలోల బియ్యాన్ని దోచుకుంటోందని ఆరోపించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేనికోసం తెలంగాణ పర్యటనకు వచ్చారో ఆయనకే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్- టీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయమైందని ఆరోపించారు.  కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు కేటాయించేలా పొత్తు ఖరారైందని జోస్యం చెప్పారు.
కేసీఆర్ వద్ద డబ్బు సంచులు తీసుకున్న ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ తో చర్చలు జరిపారని,. ఈ విషయం బయటకు పొక్కడంతో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని భావించిన రాహుల్ గాంధీ టీఆర్ఎస్ తో పొత్తు లేదంటూ ప్రగతి భవన్ నుండి వచ్చిన స్ర్కిప్ట్ ను చదువుతున్నారని విమర్శించారు.
 రాష్ట్రంలో ఎక్కడ భూములు కన్పించినా టీఆర్ఎస్ నేతలు వదలడం లేదని, చివరకు నిరుపేదల భూములను కూడా గుంజుకుంటున్నారని సంజయ్ ధ్వజమెత్తారు.  దేవాలయ భూములను కూడా వదలడం లేదని, జడ్చర్లలో రూ.1500 కోట్ల విలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను కబ్జా చేసిన దుర్మార్గులు టీఆర్ఎస్ నేతలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ నేతల కబ్జాలను చూస్తుంటే.. కేసీఆర్ తన కేబినెట్ లో వెంచర్ల కబ్జా మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. కుల వ్రుత్తులను కేసీఆర్ నాశనం చేస్తున్నరని .ప్రశ్నిస్తే తనను మతతత్వవాదులంటారా? అని విస్మయం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ పేదలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలను కేసీఆర్ ధరణి పేరుతో లాక్కుంటూ నిలవనీడలేకుండా చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. . కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న ఇక్కడ టీఆర్ఎస్ నేతలు గుంట నక్కల్లా ఇసుక, మట్టి, భూముల దోపిడీ చేస్తూ జనాన్ని పీడిస్తున్నరని విమరసంచారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు వరకు జీతాల్లేవని, బ్యాంకులు లోన్లు ఇస్తలేరని,  ఆర్టీసీ ఛార్జీలు పెంచినా ఆర్టీసీ కార్మికులకు 5 టీఏలు, 2 డీఏలు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రూప్-1 పరీక్షల్లో ఉర్ధూను ప్రవేశపెట్టడం ద్వారా హిందూ యువకులకు అన్యాయం జరుగుతోందని చెబుతూ  బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూ ద్వారా ఎంపికైన నియామకాలన్నీ రద్దు చేసి తీరుతామని స్పష్టం చేశారు.