ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సమ్మిశ్రిత విద్యావిధానంకై ప్రధాని పిలుపు

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అధ్యయనపు సమ్మిశ్రిత (హైబ్రిడ్) విధానం రూపొందించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి)పై ఉన్నత స్థాయిలో సమీక్షజరుపుతూ కరోనా వైరస్ ప్రభావంతో విద్యార్థులు స్కూళ్లకు దూరం అయ్యారని, దీనితో విద్యాభ్యాసం ఎక్కువగా ఆఫ్‌లైన్‌లో జరిగింది. సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల సాంకేతికతకు దగ్గర అయ్యారని తెలిపారు.
ఎన్‌ఇపి అమలు ఏ తీరుగా ఉంది? ఇది అమలులోకి వచ్చిన తరువాత తలెత్తిన నూతన పరిణామాలు ఏమిటీ? దీనితో తలెత్తే పరిస్థితి ఎటు దారితీస్తుంది? వంటి అంశాలను ప్రధాని మోదీ ఈ భేటీలో అత్యున్నత స్థాయిలో సమీక్షించారు. అందుబాటులోకి రావడం, సమానత, సమ్మిశ్రితత, ప్రామాణికతలే కీలక అంశాలుగా నూతన విద్యావిధానం రూపొందింది.
టెక్నాలజీని అవసరం అయిన స్థాయిలో వాడుకోవల్సి ఉంటుందని, దీని వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ అయితే విరివిగా వాడుకుంటే విద్యార్థులు దీనికి అతిగా ప్రభావితులు అయితే చేటు పరిణామాలు ఉంటాయని ప్రధాని హెచ్చరించారు. విద్యార్థులు చదువుకునే చోటికి వెళ్లాల్సి ఉంటుందని, దీని వల్లనే విద్యకు ప్రామాణికత ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
అయితే అత్యవసర స్థితిలో ఆన్‌లైన్ చదువుల అవసరం ఏర్పడుతుందని, రెండింటికి మధ్య సమన్వయం అత్యవసరం అని తెలిపారు.  అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు సంబంధించి నమోదు అయి ఉండే రికార్డులను స్కూళ్ల రికార్డులతో సమగ్రంగా అనుసంధానించాలని సూచించారు. అంగన్‌వాడిల నుంచి అత్యధిక సంఖ్యలో పిల్లలు స్కూళ్ల విద్యాభ్యాసానికి చేరుకుంటారని చెప్పారు.
ఈ క్రమంలో పిల్లల ప్రాధమిక దశలో వారి ప్రతిభ వారికి అవసరం అయిన సాధన వంటివి అంగన్‌వాడి రికార్డుల ద్వారానే తెలిసివస్తాయని ప్రధాని తెలిపారు. విద్యార్థుల సమగ్ర క్రమం తప్పని వైద్య పరీక్షలు తదనుగుణంగా వారికి చికిత్సలు అవసరం అని చెబుతూ ఇందుకు స్కూళ్లల్లో సరైన వైద్య పరీక్షలు ప్రాతిపదిక కావాలని, తరువాతి దశలో సాంకేతికత వినియోగం వల్ల ప్రయోజనం ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు.
విద్యార్థులలో సిద్ధాంతపరమైన క్రియాశీలక ప్రతిభను పెంపొందింపచేసేందుకు దేశీయంగా తయారైన ఆట వస్తువులు లేదా బొమ్మలను విరివిగా వాడుకోవచ్చునని ప్రధాని తెలిపారు. మాధ్యమిక స్థాయి స్కూళ్లలో ఉండే సైన్స్ ల్యాబ్స్‌ల సాధనాసంపత్తితో ఆయా ప్రాంతాల రైతులతో అనుసంధానం కావడం, భూముల సారాన్ని పరీక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీని వల్ల విద్యార్థుల చదువులు కేవలం తరగతి గదులకు పరిమితం కాకుండా విస్తృత స్థాయికి ఎదుగుతాయని, సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనలకు అవసరం ఏర్పడుతుందని తెలిపారు. కొత్త విద్యావిధానం పలు అధ్యయనాల తరువాత సమగ్రంగా తీర్చిదిద్దినట్లు ప్రధాని వివరించారు. డ్రపవుట్స్‌పై ప్రత్యేక దృష్టి, వారిని తిరిగి స్కూళ్లకు తిరిగి చేర్చడం అత్యంత కీలక విషయాలు కావాలని, ఎన్‌ఇపిలో దీనికి ప్రాధాన్యత ఉందని వివరించారు.