భారత్‌-నార్డిక్‌ దేశాల సహకారం మరింత బలోపేతం

భారత్‌-నార్డిక్‌ దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుందామంటూ  ఆయా దేశాలప్రధానులు ప్రతినబూనారు. ఆరు దేశాల మధ్య సమ్మిళిత వృద్ధి, స్వేచ్ఛా వాణిజ్యం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని నిర్ణయించారు. కరోనా అనంతర ఆర్థిక, ఆరోగ్య సవాళ్లను మరింత దీటుగా ఎదుర్కొనవలసిన అవసరంపై చర్చించారు.

ఐరోపా పర్యటనలో బుధవారం ఉదయం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో జరిగిన 2వ ఇండియా-నార్డిక్‌ ప్రధానుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ శాంతి, భద్రత, ఉక్రెయిన్‌ సంక్షోభం, పలు అంశాల్లో సహకారం, హరిత పరివర్తన, వాతావరణ మార్పులు, బ్లూ ఎకానమీ, సృజనాత్మకత వంటి పలు అంశాలను చర్చించారు. 

ఈ సందర్భంగా నార్వే, స్వీడన్ ఐస్‌ల్యాండ్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ దేశాలను నోర్డిక్ దేశాలుగా పిలుస్తారు. మొదటి ఇండియా-నార్డిక్ శిఖరాగ్ర సమావేశం 2018లో స్టాక్‌హోమ్‌లో జరిగింది.

ఈ సమావేశం ప్రధానంగా కరోనా మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్య, ఇంధన, మౌలిక రంగాల్లో పరస్పర సహకారం సహా ద్వైపాక్షిక బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ ప్రధాన మంత్రులు పాల్గొన్నారు.

ముఖ్యంగా.. ఉక్రెయిన్‌లో తలెత్తిన మానవతా సంక్షోభంపై ఐదు నార్డిక్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణ యుద్ధ విరమణకు పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్‌లో పౌరుల మరణాలను నిర్ద్వంద్వంగా ఖండించాయి. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా, నిష్కారణంగా యుద్ధానికి దిగిందంటూ నార్డిక్‌ దేశాల ప్రధానులు మండిపడ్డారు. 

రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సదస్సు ముగిసిన అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వారు పునరుద్ఘాటించారు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం, ఆహార ఉత్పత్తి, ప్రపంచ వ్యాప్తంగా తరుగుతున్న వనరులు వంటి అంశాలపైనా చర్చించారు. కాగా, ప్రధాని మోదీ గౌరవార్థం డెన్మార్క్‌ రాణి మార్గరెట్‌-2 మంగళవారం రాత్రి కోపెన్‌హాగెన్‌లోని రాజభవనంలో భారీ విందు ఇచ్చారు.

మూడు ఐరోపా దేశాల పర్యటన చివరి దశలో భాగంగా మంగళవారం బెర్లిన్‌నుంచి కోపెన్‌హాగన్ చేరుకున్న ప్రధాని మోదీ  తొలుత నార్వే ప్రధాని జొనాస్ గహర్ స్టోర్‌తో సమావేశం అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపైనా పూర్తి స్థాయి చర్చలు జరిపారు. 

నార్వే ప్రధానితో నిర్మాణాత్మక చర్చలు జరిపానని, స్వచ్ఛ ఇంధనం, రోదసి, ఆరోగ్యం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే విషయమై తాము చర్చలు జరిపినట్లు మోదీ  ఒక ట్వీట్‌లో తెలిపారు. ఇరువురు నేతలు సమావేశం కావడం ఇదే మొదటి సారి.

స్వీడన్ ప్రధాని మగ్దలీనా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్ ప్రధాని క్యాతరిన్ జాకోబ్స్‌డోటిర్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్‌తోను ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశంపై ఈ నేతలతో ప్రధాని చర్చించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతేకాకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఈ నేతలతో ప్రధాని చర్చించారు. భారతీయ కంపెనీలతో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఫిన్లాండ్ కంపెనీలను ప్రధాని ఆహ్వానించారు. వివిధ రంగాలు ముఖ్యంగా టెలికాం మౌలిక సదుపాయాలు, డిజిటల్ ట్రాన్స్‌ఫరేషన్ రంగాల్లో భారతీయ మార్కెట్లు అందిస్తున్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఫిన్లాండ్ కంపెనీలను కోరారు.

చివరిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ 

ఐరోపా పర్యటన చివరి అంకంలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. మూడురోజుల ఐరోపా పర్యటన ముగిసిన నేపథ్యంలో.. తిరుగుప్రయాణంలో బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ఆయన పారి్‌సలో కొద్దిసేపు ఆగారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేక్రాన్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో మోదీ ఆయనను అభినందించారు. ‘నమస్తే ప్యారిస్‌’ అంటూ తన ఫ్రాన్స్‌ పర్యటన ప్రారంభమైందని ట్వీట్‌ చేసిన మోదీ.. ఫ్రాన్స్‌-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.