రికార్డు స్థాయిలో 224 శాతం ఎగుమతుల వృద్ధి

కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే భారత్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 24.22% వృద్ధి రేటు నమోదు చేస్తూ 38.19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు భారత్ నుంచి జరిగాయి.  ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు నమోదైన ఎగుమతుల్లో ఇదే అత్యధిక రికార్డు అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
నాన్-పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో 12.32 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 30.46 బిలియన్ల అమెరికా డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.  పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో 113.21%, ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతుల్లో 64.04%, రసాయనాల ఎగుమతుల్లో 26.71% వృద్ధి నమోదైనట్టు ఇండియన్ మర్చండైజ్ ట్రేడ్ ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి.
ఎగుమతుల్లోనే కాదు, దిగుమతుల్లోనూ భారత్ ఏకంగా 26.55 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021 ఏప్రిల్‌లో 46.04 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదవగా, 2022 ఏప్రిల్ నెలలో ఏకంగా 58.26 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చోటుచేసుకున్నాయి.  నాన్-పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల్లో 9.87 శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా 20.07 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర వాణిజ్య లోటు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఎగుమతుల్లో ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోలియం ఉత్పత్తులు అగ్రభాగంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో రత్నాలు, నగలు, రసాయనాలు, ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, జౌళి-వస్త్ర రంగ ఉత్పత్తులు, బియ్యం, ప్లాస్టిక్, లినోలియం వంటివి నిలిచాయి.
దిగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బొగ్గు అగ్రభాగాన నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో యంత్రాలు, విద్యుత్ పరికరాలు, రసాయనాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, రత్నాలు, కృత్రిమ రెజిన్లు, ప్లాస్టిక్, నాన్-ఫెర్రస్ మెటల్స్, వంట నూనెలు, బంగారం ఉన్నాయి.