రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఆర్‌బిఐ

అత్యంత కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బిఐ పెంచిన్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. రెపో రేటు పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రెపో రేటు పెంపునకు మోనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు కాష్ రిజర్వ్ రేషియో  (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు వెల్లడించారు. తాజా పెంపుతో  సీఆర్ఆర్   4.50 శాతానికి పెరిగిందని శక్తికాంత్ దాస్ చెప్పారు.
ఈ ప్రభావంతో రూ.83,711.55 కోట్ల నగదు ఆర్థిక వ్యవస్థ నుంచి ఉపసంహరణ జరుగుతుందని ఆయన వివరించారు. సీఆర్‌ఆర్ పెంపు మే 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో నిరంతరాయంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని శక్తికాంత్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా రెపో రేటును చివరిసారిగా మే 2020లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు యథాతథంగా కొనసాగిస్తున్నారు. రెపో రేటు పెంపుతో రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం పెరగనుంది. రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచనున్నాయి. ఫలితంగా బ్యాంకు ఖాతాదారుల గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరింత పెరగనున్నాయి. 
 
బ్యాంకుల రుణాలు ఆర్బీఐ వడ్డీ రేట్లతో ముడిపడివుండడమే ఇందుకు కారణం. కొత్త రుణాలు తీసుకోవాలనుకునే వారిపైనా ఈఎంఐల భారం తప్పదు. రుణాలపై వడ్డీ రేట్లను త్వరలోనే బ్యాంకులు పెంచే అవకాశం ఉంది. వాస్తవానికి రెపో రేటు పెంపును రుణగ్రహీతలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రతికూలంగా భావించవచ్చు. 
 
ఎందుకంటే రుణాలపై వడ్డీ రేట్లు పెరగుతాయి. పర్యవసానంగా ఈఐఎంలు పెరుగుతాయి. ఈ ప్రభావం గృహరుణాలతో పాటు వాహన లేదా వ్యక్తిగత రుణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.