రష్యా ఇంధన కొనుగోళ్ళకు మరింత రాయితీ కోరిన భారత్

రష్యా నుండి ఇంధన కొనుగోళ్లపై మరిన్ని రాయితీలను పొందేందుకు భారత్‌ యత్నిస్తోంది. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపిఇసి)నుండి ఇతర దేశాలు దూరంగా ఉండటంతో భారత్‌ ఈ దిశగా యత్నిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చల్లో కొనుగోళ్లకు పెట్టుబడి పొందడం వంటి అడ్డంకులను భర్తీ చేసేందుకు సరఫరా ప్రాతిపదికన రష్యా నుండి ఒక్కో బ్యారెల్‌పై 70 డాలర్లు కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలని భారత్‌ కోరుకుంటోందని ఆ వర్గాలు తెలిపాయి. 
 
గ్లోబల్‌ బెంచ్‌ మార్క్‌ ప్రకారం.. ప్రస్తుతం ఒక్కో బ్యారెల్‌ 108 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు చేపట్టినప్పటి నుండి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారు అయిన భారత్‌, ఇతర ప్రైవేట్‌ సంస్థలు 40 మిలియన్‌ బ్యారెల్స్‌ కన్నా అధికంగా దిగుమతిచేసుకుందని ఆ వర్గాలు తెలిపాయి.
ఈ ఆయిల్‌ని కొనుగోలు చేయడానికి నిధుల సేకరణ వంటి రిస్క్‌లను అధిగమించేందుకు ధరలో మరింత రాయితీ ఇవ్వాలని భారత్  కోరనున్నది. ప్రభుత్వ అధీనంలోని రిఫైనరీలు, ప్రయివేట్‌ రిఫైనరీలు గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత రష్యా నుంచి 400 మిలియన్‌ బ్యారళ్ల క్రూడ్‌ చమురును కొనుగోలు చేశాయి. 2021లో రష్యా నుంచి కొనుగోలు చేసిన దానికన్నా ఇది 20 శాతం ఎక్కువ.
రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించాలనీ, రష్యాపై ఆంక్షలకు మద్దతు ఇవ్వాలని అమెరికా, దాని మిత్ర దేశాలు భారత్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే, రష్యా చమురు దిగుమతులపైనా, ఆయుధాలపైనా భారత్‌ ఆధారపడి ఉన్నందున అమెరికా, తదితర దేశాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా భారత్‌ తలొగ్గడం లేదు.