దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తేవాల్సిందే!

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) తేవాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా తన భర్తకు భార్యలు ఉండాలని కోరుకోదని ఆయన పేర్కొన్నారు. 

సమాజంలో ముస్లిం మహిళలు గౌరవంగా బతకాలంటే ట్రిపుల్ తలాక్ తరహాలో ఉమ్మడి పౌరస్మృతి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.  తనను కలిసిన ముస్లిం మహిళలందరూ ఉమ్మడి పౌరస్మృతి కావాలని కోరుతున్నట్టు హిమంత వెల్లడించారు.
 
“నేను హిందువుని, నాకు ఉమ్మడి పౌరస్మృతి ఉంది. నా సోదరికి , నా కుమార్తెకు రక్షణ ఉంది. ఇదే తరహాలో ముస్లిం కుమార్తెలకూ రక్షణ కావాలి” అని హిమంత తెలిపారు. 
 
ఉత్తరాఖండ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్ తదితర ముఖ్యమంత్రులు ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి తీసుకు వస్తున్నట్లు ప్రకటనలు చేయడం గమనార్హం. జేపికి చెందిన ముఖ్యమంత్రులు ఉమ్మడి పౌరస్మృతి గురించి వ్యాఖ్యలు చేయడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండించింది. ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీ వ్యతిరేక చర్య అని విమర్శించింది. 
 
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహితం ఈ విషయమై బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిన్నట్లు తెలుస్తున్నది. దశలవారీగా దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు రావడం ద్వారా 2024 ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో అటువంటి చట్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.