ముంబాయిలో ‌10 ఎకరాలలో శ్రీవారి ఆలయం

ముంబాయిలో ‌10 ఎకరాలలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది. దాదాపు రూ 500 కోట్లు విలువ చేసే స్థలంకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అందించారని, ఈ నిర్మాణానికి మొత్తం వ్యయం నిమిత్తం  రేమండ్ అధినేత రూ 60 కోట్ల విరాళం ఇవ్వడానికి ముందు వచ్చారని పాలకమండలి సమావేశం అనంతరం  ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  

త్వరలోనే ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతామని చెప్పారు. రూ 240 కోట్ల వ్యయంతో పిల్లల మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ కు ముఖ్యమంత్రి వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి  శంకుస్థాపన చేయనున్నారని ఆయన వెల్లడించారు. శ్రీనివాస సేతును అధికారింగా మే 5వ తేదీ సిఎం ప్రారంభిస్తారని చెబుతూ శ్రీనివాస సేతు రూ 100 కోట్లు నిధులు కేటాయింపు చేశామని తెలిపారు.

శ్రీవారి మెట్టు మరమ్మత్తులు పూర్తి చేసి, మే5వ తేది నుండి ఆ మార్గంలో అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని చెబుతూ నడకదారి భక్తులకి దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి రూ 21 కోట్లు కేటాయింపు జరిపారు.

తిరుమల తిరుపతి ఘట్ రోడ్డులో‌ రూ 20 కోట్లతో ఐఐటి నిపుణులు సూచన మేరకు మరమ్మత్తులకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరుమలలో గదులు మరమ్మత్తులు చేసేందుకు రూ 19 కోట్లు కేటాయించారు. బాలాజీ నగర్ వద్ద ప్రాంతంలో 2.86 ఎకరాల ఎలెక్ట్రిక్ చార్జింగ్ స్టేషను ఏర్పాటు చేశారు. బయో గ్యాస్ ఉత్పత్తికి, టీటీడీ క్వార్టర్స్ 737 మరమ్మత్తులకు ఆమోదం తెలిపారు. 

టీటీడీలోని విరాళాలు పద్ధతిలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. నగదు రూపంతో పాటు వస్తు రూపంలో విరాళమిచ్చిన దాతలకు కూడా దర్శన, వసతి వెసులబాటు కల్పించాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులు స్థలాలకు ప్రభుత్వంలో చర్చించేందుకు ప్రత్యేక అధికారి నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతి స్విమ్స ఆస్పత్రిలో రీజనల్ క్యాన్సర్ రోగులకు 300 పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తిరుమలలో నిర్వసితుల సమస్యల పరిష్కారానికి ఆమోదం తెలిపారు. తిరుమలకు మూడోమార్గం నిర్మాణానికి అనుమతులు ఇంకా రాలేదని, వచ్చాక మామండూరు మీదుగా మెట్లమార్గం నిర్మిస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు. బయో గ్యాస్ ద్వారా అన్నప్రసాద కేంద్రం, లడ్డు తయారీకి ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు.