వైసీపీ నేత హత్య… పరామర్శకు వెళ్లిన ఎమ్యెల్యేపై దాడి!

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి అనే గ్రామంలో ఈ రోజు ఉదయం  వైసీపీ గ్రామపార్టీ అధ్యక్షుడు గంజిప్రసాద్‌ను ఇవాళ ఉదయం కొందరు దుండగులు నరికి చంపారు. దీంతో ప్రసాద్‌ కుంటుంబసభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే తాలారి వెంకట్రావు ఆ గ్రామానికి వెళ్లారు. 
 
ఈ క్రమంలో గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో భారీగా పోలీసులు మోహరించారు. వెంటనే కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చివరకు పోలీసుల సాయంతో ఎమ్మెల్యే వెంకట్రావు గ్రామం నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యేకు దెబ్బలు బాగానే తగిలాయి. 
 
 మరోవంక, తన భర్త హత్యకు ఎమ్మెల్యే వెంకట్రావే కారణమని గంజి ప్రసాద్ భార్య సత్యవతి ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఎంపీటీసీ బజారియా అనుచరులు హత్య చేశారని ఆమె స్పష్టం చేశారు.  హోంమంత్రి వనితకు తన భర్త గంజి ప్రసాద్ అనుచరుడని ఆమె వెల్లడించారు. ఇకపై వాళ్ల ఆటలు సాగవని ఆమె హెచ్చరించారు.  తమకు న్యాయం జరిగేంత వరకూ గంజి ప్రసాద్‌ మృతదేహాన్ని తరలించేబోమని సత్యవతి స్పష్టం చేశారు.
 
 కాగా, గంజి ప్రసాద్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీస్స్టేషన్లో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ హత్యను తామే చేశామంటూ సురేష్, మోహన్, హేమంత్లు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులు ముగ్గురూ ఎంపీటీసీ సభ్యుడు బజారియా వర్గీయులు కావడం గమనార్హం. 
 
ఈ సంఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందిస్తూ వైసీపీ నేత గంజి ప్రసాద్ను దారుణంగా చంపారని తెలిపారు. గంజి ప్రసాద్ పై దాడికి కారణాలు తెలియాల్సి ఉందని, హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోందని హోంమంత్రి చెప్పారు. 
 
కాగా,  ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై  జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నానని ఆమె తెలిపారు. ఇప్పటికే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని, దాడి ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆమె చెప్పారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆమె పేర్కొన్నారు. 
 
హతుడు గంజి ప్రసాద్కు, బజారియాకు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకవైపు ఈ హత్య.. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే చేయించాడంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే.. మృతుడు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాగా.. ఆయనపై గ్రామంలోని వైసీపీ కార్యకర్తలంతా మూకుమ్ముడిగా దాడికి పాల్పడిన కొద్ది నిమిషాల్లోనే నిందితులు లొంగిపోవడం గమనార్హం.