ఐరాస చీఫ్ పర్యటిస్తున్నప్పుడే కీవ్‌పై రష్యా క్షిపణి దాడులు

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కీవ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే నగరంపై క్షిపణుల వర్షం కురిపించడం ద్వారా రష్యా ఐరాసను అవమానించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ దాడితో తాత్కాలికంగా రాజధాని మామూలు స్థితికి చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయాయి. 

ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్ వైపు మళ్లించింది.ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలక పరిశ్రమలున్నాయి. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయవచ్చని పుతిన్ భావిస్తున్నారు.

మరో వైపు మరియుపోల్‌లో ఇప్పటికీ చిక్కుపడి ఉన్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలను బట్టి తెలుస్తోంది.గురువారం రష్యా కీవ్‌తో సహా ఉక్రెయిన్ వ్యాప్తంగాక్షిపణుల వర్షం కురిపించింది.

కీవ్‌లో జరిగిన దాడిలో ఒక బహుళ అంతస్థుల భవనంతో పాటుగా మరో భవనం కూడా దెబ్బతిన్నాయి. బహుళ అంతస్థుల భవనంలో ఉంటున్న తమ మహిళా జర్నలిస్టు విరా హిరిచ్ ఈ దాడిలో చనిపోయినట్లు అమెరికా నిధుల సాయంతో నడుస్తున్న రేడియో ఫ్రీ యూరప్/రేడియో లిబర్టీ వెల్లడించింది. 

ఆమె మృతదేహం శుక్రవారం భవన శిధిలాల కింద కనిపించింది. ఈ దాడిలో మరో పది మంది గాయపడ్డారు. గుటెర్రస్‌తో కలిసి జెలెన్స్ మీడియా సమావేశంలో మాట్లాడిన గంటకే ఈ దాడి జరగడం గమనార్హం. అంతర్జాతీయ సంస్థలంటే రష్యాకు ఎంతమాత్రం గౌరవం లేదనే ఈ విషయాన్ని ఈ దాడి నిరూపిస్తోందని జెలెన్‌స్కీ తన వీడియో సందేశంలో దుయ్యబట్టారు. 

రష్యా నాయకత్వం ఐరాసను ఎగతాళి చేస్తోందని, దీనికి సరిగ్గా శక్తిమంతమైన సమాధానం లభిస్తుందని ఆయన అన్నారు.ఈ దాడులపై గుటెర్రస్ విచారం వ్యకత చేశారు. కీవ్ ఉక్రెయిన్లకే కాదు, రష్యన్లకు కూడా పవిత్ర నగరమని, అటువంటి ప్రాంతంపై క్షిపణి దాడి జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు.