అన్న మహిందను శ్రీలంక ప్రధానిగా తప్పిస్తా… గొటబయ

కీలకమైన అధ్యక్ష, ప్రధాని పదవుల్లో ఉన్న రాజపక్స సోదరులిద్దరూ తప్పుకోవాలని కోరుతూ శ్రీలంకలో ఆందోళనలు ఒకవైపు ఉధృతమవుతుండగా, మరో వైపు తన అన్న మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగిస్తానని అధ్యక్షుడు గొటబయ ప్రతిపాదించారు. 
 
తన సోదరుడిని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడానికి, ప్రతిపాదిత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని మాజీ అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. కొత్త ప్రధానమంత్రిని నియమించేందుకు జాతీయ కౌన్సిల్‌ను నియమిస్తామని, పార్లమెంట్‌లో ఉన్న అన్ని పార్టీలతో కలిసి క్యాబినేట్‌ను ఏర్పాటు చేస్తామని అధ్యక్షులు చెప్పినట్లు సిరిసేన తెలిపారు.

అధ్యక్షులు గొటబయతో సమావేశం తరువాత సిరిసేన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అయితే దీనిని ప్రధానమంత్రి మహిందా రాజపక్సే అధికార ప్రతినిధి రోహన్‌ వెలివిత ఖండించారు. అధ్యక్షులు అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అధ్యక్ష, ప్రధానమంత్రి పదవులతో సహా పలు ముఖ్యమైన పదవుల్లో రాజపక్సా కుటుంబ సభ్యులే ఉన్నారు. వీరిని గ్యాంగ్‌ ఆఫ్‌ థీవ్స్‌ (దొంగల ముఠా) గా పేర్కొంటారు. దేశం నాశనం కావడానికి వీరే కారణమన్న భావన సర్వత్రా నెలకొంది. దేశ సంపదను లూటీ చేసి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
రాజపక్స కుటుంబం తప్పుకుంటే తప్ప దేశానికి నిష్క్రతి లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మహింద రాజపక్స ఒక్కడిని తప్పించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని వారు పేర్కొంటున్నారు. శ్రీలంక ప్రజల జీవన స్థితిగతులు ఇంతగా దిగజారడానికి గత 20 ఏళ్లుగా అధ్యక్షుడు రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు సాగించిన రాజకీయ పెత్తనమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు.