అక్సామసీదుపై ఇజ్రాయిల్‌ పోలీసుల దాడి

ఇజ్రాయిల్‌ పోలీసులు అల్‌ అక్సామసీదుపై శుక్రవారం జరిపిన దాడిలో 42 మంది గాయపడినట్లు పాలస్తీనియన్‌ రెడ్‌ క్రెసెంట్‌ తెలిపింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం చివరి శుక్రవారం మసీదు ఆవరణలోకి ఇజ్రాయిలీ సెట్లర్లు ప్రవేశించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. 
 
అప్పటి నుండి రెండు వారాలుగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ముస్లింలకు మూడవ అత్యంత ప్రధానమైన ప్రార్థనా స్థలిగా పేరొందిన అల్‌ అక్సా మసీదులో కొంత భాగాన్ని యూదులు ఆక్రమించుకుని అక్కడ ప్రార్థనలు చేయడానికి యత్నించారు. దీనికి ముస్లింలు అభ్యంతరం తెలపడంతో ఘర్షణకు దిగినట్లు రెడ్‌ క్రెసెంట్‌ తెలిపింది. 
 
ఇజ్రాయిల్‌ ఆక్రమిత తూర్పు జెరూసలెం ప్రాంతంలో ,700 మంది యూదు సెట్లర్స్‌ ఉన్నారు. రంజాన్‌ మాసంలోనే యూదుల పండగ కూడా రావడంతో టెంపుల్‌ మౌంట్‌ సందర్శనకు వెళ్లే ఇజ్రాయిలీయులు అల్‌ అక్సామసీదులో ప్రవేశించి కొంత భాగం తమకు ఇస్తే అక్కడ తమ దైవాన్ని నెలకొల్పుకుంటామని వాదనకు దిగారు. 
 
గత రెండు వారాలుగా జరుగుతున్న ఈ హింసలో ఇప్పటివరకు 300 మంది పాలస్తీనీయులు గాయపడ్డారు. మార్చి 22న ఇజ్రాయిల్‌లోను, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంలోను హింసాత్మక దాడులు చోటు చేసుకున్నప్పటి నుంచి జెరూసలెంలో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.

కాబుల్ మసీదులో పేలుడు…66 మంది మృతి

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ నగరంలోని మసీదులో తాజాగా శక్తివంతమైన మరో బాంబు పేలుడు సంభవించింది. కాబూల్ మసీదులో సంభవించిన పేలుడులో 66 మంది భక్తులు మరణించారు.ఈ పేలుడులో ఇప్పటివరకు 66 మృతదేహాలు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి వచ్చాయని అప్ఘాన్ అధికారులు చెప్పారు. 
 
మరో 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ముస్లింల పవిత్ర మాసం రమజాన్ చివరి శుక్రవారం ప్రార్థనల కోసం వందలాది మంది భక్తులు గుమిగూడటంతో ఖలీఫా అగా గుల్ జాన్ మసీదు కిక్కిరిసిపోయింది. 
 
అప్పుడే మసీదులో పేలుడు సంభవించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.పేలుడుతో తాలిబన్ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పేలుడుకు మూలం వెంటనే తెలియరాలేదు. ఈ పేలుడుకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు.
ఈ పేలుడు ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కాబూల్ పోలీసు చీఫ్ యొక్క ప్రతినిధి ఖలీద్ జద్రాన్ ట్వీట్ చేశారు.పేలుడు చాలా శక్తివంతమైనదని, దీనివల్ల మసీదు పైకప్పు కూలిపోయిందని జావిద్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు.