రష్యా బోట్లను ముంచేసిన ఉక్రెయిన్

తమ సేనలు రెండు రష్యా గస్తీ నౌకలను నల్లసముద్రం వద్ద ముంచేశాయని ఉక్రెయిన్ తెలిపింది. ఇక్కడి స్నేక్‌ల్యాండ్ తీరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోనే చాలా రోజుల కిందట ఉక్రెయిన్ సేనలు లొంగిపోవాలని రష్యా సేనలు చేసిన డిమాండ్ పనిచేయలేదు. 
 
ఇప్పుడు ఏకంగా రష్యా బోట్ల పతనం జరిగింది. అత్యంత కీలకమైన బ్లాక్‌సీ ఐలాండ్స్‌పై ఆధిపత్యానికి రష్యా యత్నిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ పలు రష్యా గస్తీ నౌకలు తిరుగుతున్నాయి. వీటిలో రెండింటిని తాము ధ్వంసం చేశామని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ సామాజిక మాధ్యమంలో తెలిపింది. 
 
ఈ రెండు చిన్నపాటి సైనిక నౌకలు. ఉక్రెయిన్ సేనల దాడితో వీటిలో నుంచి మంటలు పొగలు వెలువడుతూ ఇవి సముద్రపు నీట మునిగిన వైనం తెలిపే వీడియో దృశ్యాలను ప్రకటనతో పాటు జతపరిచారు.
 
మరోవంక, ఉక్రెయిన్‌లోని మేరియూపోల్‌లోని ఓ ప్రఖ్యాత స్టీల్‌ప్లాంట్‌లో చిక్కుపడ్డ పౌరుల తరలింపు ప్రక్రియ ఆరంభం అయింది. స్థానికంగా ఇప్పటికీ ఉధృతమవుతూ వస్తోన్న రష్యాబాంబు దాడులతో పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లుతున్నారు. 
 
ఈ లోగా ఇక్కడి స్టీల్‌ప్లాంట్ ఆవరణ ఒక్కటే ఇప్పటికీ ఉక్రెయిన్ సేనల ఆధీనంలో ఉండటంతో ఇది సురక్షితంగా భావించి అత్యధిక సంఖ్యలో పౌరులు తమ కుటుంబాలతో ఇక్కడికి చేరారు. ఈ ప్రాంతం నుంచి సహాయక బృందాలు చిక్కుపడి ఉన్న ప్రజలను దూర ప్రాంతాలకు తరలిస్తూ వస్తున్నాయి. 
 
స్టీల్‌ప్లాంట్‌లో ఇంతకాలం బందీగా ఉండాల్సిన పరిస్థితి నుంచి బయటపడ్డ వారిలో కొందరు బయటకు వచ్చారు. అయితే ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో జనం లోపల ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ముందుగా వృద్ధులు, పిల్లలను చుట్టూ పేరుకుపోయి ఉన్న శిథిలాలు మట్టిదిబ్బల నుంచి అక్కడికి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపోరిజజియాకు తరలించే పని ఆరంభమైనట్లు దేశాధ్యక్షులు జెలెన్‌స్కీ తెలిపారు.