ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ సౌదీ అరేబియాలో ఈద్‌ ప్రార్ధనల్లో ఉన్నారు. అది ముగిసిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. 
 
సౌదీ అరేబియాలోని మదీనాలో పాక్‌ ప్రస్తుత ప్రధానమంత్రి షాబాజ్‌ షరీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనలో ఇమ్రాన్‌పై పోలీసులు దైవదూషణ కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని పాక్‌ మీడియా పేర్కొంది. 
 
పాక్ హోం మంత్రి రాణా స‌న‌వుల్లాకు సంబంధించిన మీడియా రిపోర్టుల్లో కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా పేర్కొన్నారు. దైవదూషణ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టవుతారని పాక్ నూతన అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.
 
 ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌ మద్ధతుదారులు కొంతమంది పోకిరివేశాలు వేశారు. ప్రధాని షాబాజ్ షరీఫ్‌తోపాటు ఆయన బృందానికి వ్యతిరేకంగా మసీదులో పరుష పదజాలాన్ని వాడారు. దొంగలు, కుట్రదారులు అంటూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా నేరపూరిత భాష ఉపయోగించారు.
సౌదీ అరేబియాలోని మదినాలో ప్రార్థ‌నా మందిరం ద‌గ్గ‌ర గత గురువారం పాక్‌ కొత్త ప్ర‌ధాని షాహ‌బాజ్‌, అతని ప్రతినిధుల బృందానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారని ఇమ్రాన్‌ ఖాన్‌పై కేసు నమోదైంది.
కాగా మదీనాలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రధాన మంత్రి బృందానికి వ్యతిరేకంగా పరుష పదజాలం వాడినట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది. 
 
నేరపూరిత భాష వాడారనే కారణంగా సౌదీ పోలీసులు ఐదుగురు పాకిస్తాన్ పౌరులను అరెస్ట్ చేశారని సౌదీ మీడియా పేర్కొంది. కాగా ఇమ్రాన్ ఖాన్ ఈ వివాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పవిత్ర స్థలం వద్ద నినాదాలు చేయాలని ఎవరికీ చెప్పే ఉద్దేశ్యం కూడా తనకులేదని చెప్పుకొచ్చారు.
 ఈ వీడియోల ఆధారంగా పాకిస్థాన్‌లో పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పాక్ మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్, ఇమ్రాన్ వద్ద చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన షాబాజ్ గిల్‌తోపాటు 150 మందిపై పాక్‌లోని ఫైసలాబాద్‌లో దైవదూషణ కేసు నమోదయ్యింది.