ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. విజేతలు ఎవరూ ఉండరు

యుక్రెయిన్ – రష్యా  యుద్ధంలో ఎవరూ విజేతలుగా అవతరించలేరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ శాంతికి మద్దతిస్తుందని తెలుపుతూ యుద్ధానికి ముగింపు పలకాలని ఇరుదేశాలనూ ఆయన కోరారు. యుద్ధం వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన యుద్ధం గురించి స్పందిస్తూ  ఉక్రెయిన్‌లో హృదయవిదారక దృశ్యాలే కాకుండా ఆయిల్ ధరలు పెరిగాయని,  గ్లోబల్ ఫుడ్ సప్లయి చెయిన్‌పై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు  ప్రపంచ కుటుంబంపై భారంగా మారతాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. 

 బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్‌ ఒలాప్‌ స్కోల్జ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని తెలిపారు. శాంతియుత చర్చలే ముందున్న ఏకైక మార్గమమని మరోసారి పేర్కొన్నారు. 

యుద్ధం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై కూడా చూపుతోందన్న మోదీ.. యుద్ధంతో ఏర్పడిన మానవతావాద పరిణామాల గురించి భారత్‌ ఆందోళన చెందుతోందని మోదీ చెప్పారు. 

జర్మనీ ఛాన్సలర్‌ ఒలాప్‌ స్కోల్జ్‌,  ప్రధాని మోదీ సారధ్యంలో సోమవారం మధ్యాహ్నం భారత్ – జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్‌(ఐజీసీ) జరిగింది. బృంద స్థాయి చర్చలకు ముందు ఇరువురూ ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిపారు. 

ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ సంయుక్త అధ్యక్షతన సోమవారం ఇక్కడనే ఇరుదేశాల అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజిసి) 6వ సమావేశం జరిగింది. ఇది అత్యంత కీలకమైన ద్వైవార్షిక సదస్సు అని ఇరుదేశాల స్నేహ సహకారాల పటిష్టతకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ విలేకరులకు తెలిపారు. పలు కీలక అంశాలపై సమగ్రమైన సంప్రదింపులకు ఐజిసి దారితీస్తోందని బాగ్చీ తెలిపారు. 

ఈ కీలక భేటీకి ప్రధాని మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు ధోవల్ ఇతరులు కూడా హాజరయ్యారు. ఒజిసి భేటీ దశలో ప్రధాని మోడీ, జర్మనీ ఛాన్సలర్ ప్రపంచ స్ధాయి వ్యాపారవేత్తలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

బెర్లిన్‌లోని అధ్యక్ష భవనం వద్ద ప్రధాని మోదీకి దేశాధ్యక్షులు స్వాగతం పలికారు. తరువాత ఇరువురు నేతలు ముఖాముఖిగా భేటీ జరిపారు. తరువాత ఇరుదేశాల ప్రతినిధి బృందాల మధ్య సంప్రదింపులు సాగాయి. 

ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఇమిడి ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాతిపదికన ఈ చర్చలు సాగాయని ఆ తరువాత భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన వెలువరించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పుడు సాగుతోన్న పోరు సమయంలోనే భారత ప్రధాని మోడీ జర్మనీలో పర్యటనకు వచ్చారు.

 గ్రీన్‌ ఎనర్జీ, సుస్థిర ఇంధన భాగస్వామ్యం, హైడ్రోజన్‌ టాస్క్‌ఫోర్స్‌ వంటి తొమ్మిది ఒప్పందాలపై భారత్‌-జర్మనీ సంతకాలు చేశాయి. 3 రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు అక్క‌డి అధికారులు, ప్ర‌వాస భార‌తీయులు స్వాగ‌తం ప‌లికారు.  

 ఒక యువ విద్యార్థి దేశభక్తి పాటతో మోదీకి ఘన స్వాగతం పలకగా.. మాన్యా అనే అమ్మాయి పెన్సిల్-స్కెచ్‌తో గీసిన ప్రధాని మోదీ చిత్రాన్ని బహుకరించింది.  మోదీ ఈ పర్యటన భారత్‌, జర్మనీ ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందింప చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.