కేసీఆర్  పాలమూరు రా! చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు చూపిస్తా

రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు ఆగిపోయాయంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. 
 
తన పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా చేనేత కార్మికుల అర్తనాదాలు, ఆకలి కేకలు విన్పించాయని చెబుతూ చేనేత కార్మికులు బతకు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పెద్ద ఎత్తున పొట్ట  చేతబట్టుకొని  వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు పాలమూరు కు వస్తే ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటంబాలను, వలస పోతున్న వారిని చూపిస్తానని సవాల్ విసిరారు.
చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్ టైల్స్ పార్కులకు అనుమతిస్తే.. తెలంగాణకు సైతం కేటాయించారని పేర్కొన్నారు.  కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు భూమిని కేటాయించకుండా కేంద్రాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు.
 ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా  బండి సంజయ్ కుమార్ నారాయణపేట్ నియోజకవర్గంలో పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావుతో కలిసి 19వ రోజు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కిష్టాపూర్ గ్రామంలో బీజేపీ జెండా ఎగరేసి ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
 ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే  చేనేత మగ్గాలు భారమై మూతపడేసిన కుటుంబాలను చూపిస్తా…  అప్పులపాలై ఇళ్లకు తాళాలేసి పొట్ట చేతపట్టుకుని ముంబై, భీవండి, సూరత్ వలస వెళ్లిన చేనేత కార్మికులను చూపిస్తా… టీఆర్ఎస్ దుర్మార్గ, నీచ, నిక్రుష్ట పాలనలో బతకలేక ఆత్మహత్యలు చేసుకున్న నేతన్న కుటుంబాలను సాక్షాధారాలతో చూపిస్తా అని సంజయ్ స్పష్టం చేశారు. 

పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని 1.4 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే  ఈ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వని కేసీఆర్ సెక్రటేరియట్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెటి 100 గదులు కట్టుకుని ఊరేగుతున్నడని ధ్వజమెత్తారు.  పేదలకు 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తే… వాటిని ఇవ్వకుండా నిలిపేసిన కేసీఆర్ ను నిలదీయండని పిలుపిచ్చారు. 

స్కూళ్లకు కనీస సౌకర్యాల్లేవు. వైద్య సౌకర్యాల్లేవు. ఇక్కడి నేతలు గుంట నక్కల్లా ఇసుక దందా చేస్తూ… దోచుకుతింటున్నరని ధ్వజమెత్తారు.  చేనేత రంగానికే కాదు గొర్రెల, చేపల పంపిణీకి కూడా కేంద్రం ఆర్దిక సాయం చేస్తోందని తెలిపారు. 
 
గొర్రెల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రూ  4 వేల కోట్ల రుణం అందజేస్తే.. అందులో వెయ్యి కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు. దీంతోపాటు గొర్రెల, చేపల దాణా కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వందల కోట్ల రూపాయలు సాయం చేస్తోందని చెప్పుకొచ్చారు.
 
తెలంగాణలో నీళ్ల సమస్య లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నరు.. ఇక్కడే కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఉంది.. కానీ ఈ ప్రాంతానికి నీళ్లు రావడం లేదు… కేటీఆర్ కు చెవులు వినబడవు.. కేసీఆర్ కు కళ్లు కనబడవని బీజేపీ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జీ మురళీధర్ రావు ధ్వజమెత్తారు. 
 
డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ఆశ చూపిన కేసీఆర్… ఇంత వరకు ఈ కిష్టాపూర్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టలేదు. ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వం అని చెబుతూ  ఇచ్చిన మాట ప్రకారం 370 ఆర్టికల్ ను రద్దు చేశారని,  అయోధ్యలో రామ మందిరం నిర్మించారని, ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసారని గుర్తు చేశారు.

తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని చెబుతూ కేసీఆర్… ఆయన తరువాత కొడుకు ఆ తరువాత మనవడు రాజ్యమేలాలని చూస్తున్నరని ఎద్దేవా చేశారు.  అవినీతిలోనూ కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరూ ఒక్కో కౌంటర్ ఓపెన్ చేస్తూ వసూలు చేస్తోందని విమర్శించారు. ఈ దేశంలో అవినీతికి తావులేని పాలన చేస్తోంది బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తావు లేకుండా పాలన చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే అని తెలిపారు.