పక్షం రోజులైనా వడ్ల గింజలు కొనరే

బిజెపి తెలంగాణ శాఖ చేసిన అనేక ఉద్యమాలకు తలవొగ్గే   రాష్ట్రంలో ప్రతీ వడ్ల గింజ కొంటామని ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశం అనంతరం  ఆర్భాటంగా ప్రకటించి 15 రోజులు కావొస్తున్నా ఇంకా పూర్తిగా కొనొగుళ్ళు చేపట్టారే అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
 
 ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న తనకు అనేక మంది రైతులు వచ్చి కొనుగోళ్ళ కేంద్రాలు ప్రారంభించలేదని చెబుతున్నట్లు కేసీఆర్ కు వ్రాసిన ఓ లేఖలో తెలిపారు. 
 
 గద్వాల్‌ లో 71 కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం రెండు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని,  వనపర్తిలో 225 కేంద్రాలకు  19 కేంద్రాలు, నారాయణపేట్‌లో 91 కేంద్రాలకు 70 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని సంజయ్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కాంటా పెడుతున్నది మాత్రం నామామాత్రమని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం 2,500 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని, . రాష్ట్ర ప్రభుత్వం 60 లక్షల టన్నులు ధాన్యం కొనాల్సి వుండగా కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొన్నదని పేర్కొన్నారు. దీన్ని బట్టే రాష్ట్రప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉన్నదో స్పష్టం అవుతున్నదని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించటమే కాకుండా ప్రతీ ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కాంటా ఏర్పాటుచేసి ప్రతీ ఒక్క గింజ కొనుగోలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.  ధాన్యం కొనుగోలుకయ్యే ప్రతి పైసా ఖర్చును కేంద్రప్రభుత్వమే చెల్లిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అలసత్వాన్ని చూపించకుండా ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిదికన చర్యలు చేపట్టాలని కోరారు. 

రాష్ట్రప్రభుత్వం సేకరించిన వడ్లను బియ్యంగా మార్చి కేంద్రప్రభుత్వానికి ఇస్తే పూర్తిగా తీసుకోవడానికి  సిద్ధంగా ఉందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గింజ కొనేవరకు, వారికి చెల్లించాల్సిన సొమ్ములను చెల్లించే వరకు రైతులు పక్షాన బిజెపి పోరాడుతుందని స్పష్టం చేశారు.