కేటీఆర్‌..నీ అయ్యా చరిత్ర సినిమాగా తీస్తా, రజాకార్‌ ఫైల్స్‌ తీస్తా

‘కేటీఆర్‌.. నీ అయ్య చరిత్రను సినిమాగా తీస్తా… రజాకార్‌ ఫైల్స్‌ సినిమా తీస్తా.. నీ చరిత్ర, నీ అయ్య చరిత్రను అందులో చూపిస్తా..’ అంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
 
 ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి  నారాయణపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాముడి చరిత్రను ప్రజ లకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభాస్‌ ఆది పురుష్‌ సినిమా తీస్తుంటే అది కూడా బీజేపీ సినిమా అని కేటీఆర్ ప్రచారం చేయడం పట్ల మండిపడ్డారు. 
 
‘ఎన్నికలొస్తే బీజేపీ సినిమాలు తీసి హిందువులను రెచ్చగొడుతోందని కేటీఆర్‌ అంటున్నాడు..  సర్జికల్‌ స్ట్రయిక్స్‌ పేరుతో పాకిస్తాన్‌ తీవ్రవాదులను మట్టుబెట్టిన ఘనత నా సైనికులది. 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన మహాను భావుడు నరేంద్రమోదీ. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి తీరుతాం. ..’ అని స్పష్టం చేశారు.

‘తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని పార్టీ ఎంఐఎం.. తెలంగాణ రాష్ట్రం వస్తే హిందూ రాజ్యం వస్తదని అడ్డుకున్న పార్టీ అది.. ఆ పార్టీతో దోస్తానా చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న వారిని మతతత్వ వాదులుగా ముద్ర వేస్తూ, కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకా వలసలు కొనసాగడానికి ముమ్మాటికీ బాధ్యుడు కేసీఆరే. పాలమూరులో వలసలు ఆగాయంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నడు. ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే నారాయణపేట నుంచి ముంబై వెళ్తున్న బస్‌ కన్పించింది. ఆ బస్సెక్కి ప్రయాణికులను, డ్రైవర్‌ను అడిగిన. రోజూ ముంబైకి వలసలు వెళుతున్నట్టు తెలిసింది’ అని సంజయ్ వెల్లడించారు.

చిన్న పిల్లలు, చంటి పిల్లల తల్లులు కూడా వలస వెళ్తున్నారు. చిన్నపిల్లలు ఏడుస్తూ వారి బాధలు చెబుతుంటే తనకు ఏడుపొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ప్రపంచంలో ఎక్కడా ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోలేదు. సీఎం కొడుకు నిర్వాకం వల్ల గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మూర్ఖుల పాలనలో రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం స్పందించని మూర్ఖుడు కేసీఆర్‌’ అని సంజయ్ ధ్వజమెత్తారు. 

దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనే భ్రమల్లో కేసీఆర్‌ ఉన్నారని, కానీ రాష్ట్రంలో హుజూరాబాద్‌, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోనే ప్రజలు టీఆర్‌ఎ్‌సని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సంజయ్ హితవు చెప్పారు.

బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తామని, వలసలను నివారిస్తామని సంజయ్‌ హామీ ఇచ్చారు. 69 జీఓను అమలు చేసి మక్తల్, నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాలకు 2 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ఆయన  ప్రకటించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, శాసనసభాపక్ష నేత రాజాసింగ్, రాయచూర్‌ అర్బన్‌ ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.