3 నెలల్లో హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు అనుమతులు మంజూరయ్యాయని, మూడు నెలల్లో తానే నిర్మాణ శంకుస్థాపనకు వస్తానని  కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ.7,853కోట్ల జాతీయ రహదారులకు శంకుస్థాపన,  ప్రారంభోత్సవం చేశారు. 
10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయగా… 2 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. దాదాపు 258 కిలో మీటర్ల జాతీయ రహదారుల విస్తరణకు గడ్కరీ శంకుస్థాపన చేశారు.  తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం అని కొనియాడుతూ  ప్రగతిశీల సంపన్న రాష్ట్రంగా ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్స్ ప్రధానమని  తెలిపారు. జాతీయ రహదారుల శంకుస్థాపన కేవలం ట్రైలర్ మాత్రమేనని చెబుతూ అమెరికాలోని ప్రమాణాలతో  హైవేలు ఉంటాయని భరోసా ఇచ్చారు.  
 
 తెలంగాణ అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి సాధించినట్లేనని చెబుతూ రింగ్‌రోడ్డు కోసం భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అదే విధంగా జాతీయ రహదారుల వెంట లాజిస్టిక్స్ పార్కులు నిర్మించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 
 తెలంగాణలో కా ళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయని చెబుతూ  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోరిన వెంటనే కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య తీరిందని చెప్పారు. భారతదేశ అభివృద్ధిలో హైదరాబాద్ కీలకంగా మారిందని పేర్కొంటూ అమెరికా రోడ్లతో సమానంగా తెలంగాణ హైవేలను అభివృద్ధి చేస్తున్నామని హామీ ఇచ్చారు. 
 
జాతీయ రహదారుల అభివృద్ధితోనే పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయని నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు. దేశం మొత్తం మీద చేపట్టిన 26 గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవేల్లో హైదరాబాద్ నుంచే 5 ఉన్నాయని గడ్కరీ తెలిపారు. తెలంగాణలోని 32 జిల్లాలకు జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని చెప్పారు.
2014 నుంచి తెలంగాణలో 4,996 కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించామని చెబుతూ  తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఐదు వేల కోట్లతో హైదరాబాద్ టు విశాఖపట్నం హైవే నాగపూర్ విజయవాడ హైవే కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గడ్కరీ వివరించారు.
 
తెలంగాణ ప్రగతికి జాతీయ రహదారులు కీలకమని కేంద్ర రహదారుల సహాయ మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. నితిన్ గడ్కరీ చొరవతోనే తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయని చెప్పారు. తెలంగాణ రహదారుల నిర్మాణం కోసం కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని పేర్కొంటూ  తెలంగాణలో పెండింగ్ ప్రాజక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 
 
జాతీయ రహదారుల ముఖచిత్రం మార్చివేసిన ఘనత డైనమిక్ మినిస్టర్ నితిన్ గడ్కరీదేనని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాదారు. తెలంగాణ గేమ్ చేజంర్ గా రీజనల్ రింగ్ రోడ్డు ఉండబోతోందని చెబుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ ముందుంటుందని చెప్పారు. మోదీ హాయాంలో తెలంగాణలో 4,996 కిమీ జాతీయ రహదారులు నిర్మించామని పేర్కొన్నారు.
 
శ్రీశైలం హైవేను 4లేన్ల రహదారిగా విస్తరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చేవెళ్ల ఎంపి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని జల్ పల్లి మునిసిపాలిటీ, పహాడీ షరీఫ్ ప్రాంతాలు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గ మధ్యలోకి వస్తాయని, ఈ రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రితో ఎంపి తెలిపారు. 
నితిన్‌గడ్కరీకి సిఎం కెసిఆర్ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ 2014 నుంచి 2525 కిలోమీటర్ల పొడవును పొడిగించడం ద్వారా రాష్ట్రంలో ఎన్‌హెచ్ నెట్‌వర్క్‌ను మెరుగుపడిందని పేర్కొన్నారు. వార్షిక ప్రణాళిక 2021-,22లో 613 కి.మీల పొడవుతో రూ.6211 కోట్ల విలువైన 15 ఎన్‌హెచ్ ప్రాజెక్ట్‌లను మంజూరు చేసినందుకు వేముల గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.