
న్యాయస్థానాలలో అన్ని స్థాయిలలో ఖాళీల భర్తీపై ప్రధానంగా ద్రుష్టి సారిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో 39వ ప్రధాన న్యాయమూర్తుల సదస్సును ఆయన ప్రారంభిస్తూ కరోనా సమయంలో న్యాయమూర్తులందరూ ప్రదర్శించిన దృఢత్వం, సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు.
‘పరిపాలనపరంగా ఇది ఒక పెద్ద సవాలు. సహౌద్యోగులు, అధికారులు, రిజిస్ట్రీల సిబ్బంది, న్యాయవాదులు సంరక్షణ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది’ అని ఆయన తెలిపారు. రాజ్యాంగ న్యాయస్థానాల పనితీరు దెబ్బతినకుండా చూసుకోవడంలో తమ పని దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. మనుగడ కోసం పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా ఉన్నామని కొనియాడారు.
శనివారం విజ్ఞాన భవన్ లో ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశం జరగనుంది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం, ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులు ఆరు సంవత్సరాల తరువాత జరుగుతుండటం విశేషం.
ఈ సమావేశంలో రూపొందించిన తీర్మానాలను శనివారం జరిగే సంయుక్త సమావేశంలో ప్రభుత్వం దఅష్టికి తీసుకువెళతామని ఆయన చెప్పారు. వీటిపై ఏకాభిప్రాయానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇందుకోసం ఆరు అంశాలతో ఆయన అజెండా వివరించారు. ఖాళీల భర్తీ అంశం అత్యంత కీలకమైన అంశమని ఆయన తెలిపారు.
దీంతో పాటు ‘ఐటీ మౌలిక సదుపాయాలు పటిష్టపర్చడం, జిల్లా కోర్టుల్లో మానవ వనరుల అవసరాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం, న్యాయమూర్తుల నియామకం, వేతనాలు, పదవీ విరమణ’ వంటి అంశాలు అజెండాలో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా సామాజిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తుల సిఫార్సులను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
ఈ విషయంలో కొన్ని హైకోర్టులు ప్రోత్సాహకరంగా స్పందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్న హైకోర్టుల్లో వాటి భర్తీ కోసం పేర్లను త్వరగా పంపాల్సిందిగా ప్రధానన్యాయమూర్తులకు ఆయన సూచించారు.
గతేడాది తాను సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైకోర్టుల్లో నియామకాల కోసం కొలీజియం ఇప్పటివరకు 180 సిఫార్సులు చేసిందని, ఇందులో 126 నియామకాలు జరిగాయని వెల్లడించారు. మరో 54 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం ఉన్నాయని చెప్పారు.
వివిధ హైకోర్టుల నుండి ప్రభుత్వానికి దాదాపు 100 ప్రతిపాదనలు అందాయని, అయితే అవి ఇంకా సుప్రీం కోర్టుకు చేరలేదని తెలిపారు. మిగిలిన 212 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలను పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులకు స్పష్టం చేశారు.
‘సమిష్టి కృషితో వివిధ హైకోర్టులలో 126 ఖాళీలను ఏడాది లోపు భర్తీ చేశాం. మరో 50 మంది నియామకాలు ఆశిస్తున్నాం’ అని సిజెఐ చెప్పారు. న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే సమస్యలను చర్చించడం, గుర్తించడం ఈ సదస్సు లక్ష్యమని ఆయన తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తుల సమావేశం 2016లో జరిగిన చివరి సమావేశంలో తీసుకున్న తీర్మానాల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షిస్తారు. దేశంలో న్యాయ బట్వాడా వ్యవస్థను మెరుగుపరిచే చర్యలను కూడా చర్చించనున్నారు. దీనికి సుప్రీం కోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ హాజరవుతారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగ్పుర్లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ