న్యాయస్థానాల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలి

న్యాయస్థానాల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. ఇది న్యాయవ్యవస్థపై దేశంలోని సామాన్య పౌరులకు నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు. 

ఢిల్లీ లోని విజ్ఞానభవన్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ  2015లో అసంబద్ధంగా మారిన సుమారు 1800 చట్టాలను తాము గుర్తించామని చెప్పారు. వీటిలో 1450 చట్టాలను కేంద్రం రద్దు చేయగా, రాష్ట్రాలు కేవలం 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయని ప్రధాని తెలిపారు.

న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు చేపడతామని తెలుపుతూ న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు. దేశం అమృత కాలంలో ఉందని పేర్కొంటూ ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ సులభంగా, సత్వర న్యాయం అందించే న్యాయవ్యవస్థ కోసం మనమంతా ఆలోచన చేయాలని నరేంద్ర మోదీ సూచించారు.

దేశంలో న్యాయవిద్య అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహిస్తే సాధారణ పౌరుల్లో విశ్వాసం పెంపొందించడమే కాకుండా, న్యాయవ్యవస్థకు వారిని దగ్గర చేసినట్లు అవుతుందని ప్రధాని పేర్కొన్నారు.

పురాతన చట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందని చెబుతూ మన దేశంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి రక్షణగా ఉంటే, శాసన శాఖ పౌరుల ఆశయాలను ప్రతిబింబించేలా పనిచేస్తుంటుందని తెలిపారు. ఈ రెండిటి కలయిక సమర్థవంతమైన, నిర్ణీత కాలంలో న్యాయాన్ని అందజేసే న్యాయ వ్యవస్థకు రోడ్‌మ్యాప్‌‌ను సిద్ధం చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు.

కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ  సూచించారు. సామాన్యులకు చట్టంలోని చిక్కులు కూడా తీవ్రమైన అంశమని చెప్పారు.

చట్టం అందరి విషయంలో సమానంగా ఉంటుంది

న్యాయ, ప్రభుత్వ వ్యవస్థలు.. రెండు పరస్పర సహకారంతో సాగాలని,  ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే అని స్పష్టం చేస్తూనే చట్టం అందరి విషయంలో సమానంగా ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్  వి రమణ స్పష్టం చేశారు.  వార్డు మెంబర్‌ నుంచి ఎంపీ వరకూ అందరిని గౌరవించాలని సూచించారు. 

“ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే. వార్డు సభ్యుడి నుంచి లోక్‌సభ సభ్యుడి వరకు అందరినీ గౌరవించాలి. అయితే కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయి. న్యాయపరమైన తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్దేశ పూర్వక చర్యలు ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కావు ” అని చెప్పుకొచ్చారు.

ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కోర్టుల్లో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుంది. న్యాయవ్యవస్థలోని ఖాళీలను ఎప్పటికప్పుడూ భర్తీ చేయాలని సూచించారు. 

ఏడాది కాలంగా జడ్జిల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని సంతోషం వ్యక్తం చేశారు. 10 లక్షల మంది జనాభాకు 20 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారని చెప్పారు. కింది కోర్టుల్లో మాతృభాషలోనే తీర్పులు వివరించాల్సిన అవసరమని తెలుపుతూ సీఎంలు, హైకోర్టు సీజేలు పరస్పర సహకారంతో పనిచేయాలని జస్టిస్ రమణ సూచించారు. 

న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని సీజేఐ పేర్కొంటూ కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది కావాలని కోరారు. కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కాదని తెలిపారు.