ఆర్మీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించిన జనరల్​ మనోజ్​ పాండే

జనరల్‌ మనోజ్‌ పాండే ఆర్మీ స్టాఫ్‌ 29వ చీఫ్‌గా శనివారం  బాధ్యతలు చేపట్టారు. జనరల్ పాండే కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి 1.3 మిలియన్ల బలమైన బలగాలకు నాయకత్వం వహించిన మొదటి అధికారి.
జనరల్ పాండే ఫిబ్రవరి 1న ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహిస్తూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భద్రత, రక్షణ బాధ్యతలను నిర్వహించారు.   భారతదేశం అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ పాండే భారత సైన్యం  బాధ్యతలను స్వీకరించారు.
వీటిలో వరుసగా పాకిస్తాన్, చైనాతో ఎల్ఎసితో  పాటు ఎల్​వోసీ వంటి సమస్యలున్నాయి. కాగా, ఆర్మీ చీఫ్‌గా ఆయన థియేటర్ కమాండ్‌ను రూపొందించే ప్రభుత్వ ప్రణాళికపై ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో సమన్వయం చేసుకోవాలి.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థిగా డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (ది బాంబే సాపర్స్)లో పాండే నియమితులయ్యారు. జనరల్ పాండే అన్ని రకాల భూభాగాల్లో సంప్రదాయ, ప్రతి-తిరుగుబాటు కార్యకలాపాలలో అనేక ప్రతిష్టాత్మకమైన కమాండ్, స్టాఫ్ అసైన్‌మెంట్‌లను నిర్వహించారు.
 బ్రిటన్‌లోని కంబెర్లీ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. హయ్యర్ కమాండ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులు చేశారు. 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ (బాంబే సాపర్స్)లో చేరారు. భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో 2001-02లో భారత్-పాక్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన సమయంలో ఆపరేషన్ పరాక్రమ్‌లో జనరల్ పాండే విధులు నిర్వహించారు.
ఆ సమయంలో సరిహద్దులకు ఇరువైపులా, జమ్మూ-కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పెద్ద ఎత్తున దళాల మోహరింపు జరిగింది.  అప్పట్లో జనరల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించిన పాండే ఆపరేషన్ పరాక్రమ్‌లో 117 ఇంజినీర్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు.
నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ-కశ్మీరులోని సమస్యాత్మక ప్రాంతం పలన్‌వాలా సెక్టర్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. 39 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో విభిన్న వాతావరణాల్లో, వైవిద్ధ్యభరితమైన  కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.