టీఆర్ఎస్కు బీజేపీ భయం పట్టుకుంది

టీఆర్ఎస్కు బీజేపీ భయం పట్టుకుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే టీఆర్ఎస్ నేతలు, నాయకత్వం పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దేశంలో మార్పు కల్వకుంట్ల కుటుంబంతోనే వస్తుందన్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని చెబుతూ దేశ పౌరుడిగా ఫ్రంట్ పెట్టుకున్నా, టెంట్ వేసుకున్నా తమకు అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

\అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా ఆ హక్కు ఉందని ఆయన చెప్పారు. చెట్ల మీద విస్తారాకులు కుడుతున్న కేసీఆర్.. గత 8 ఏండ్లలో తెలంగాణను ఉద్దరించినట్లు దేశంలో గుణాత్మక మార్పు రావాలి అంటున్నారని మండిపడ్డారు. గుణాత్మక పాలన అంటే కేసీఆర్ అహంకారపూరిత అబద్దాల పాలనా? రాజ్యాంగాన్ని కాలరాసే పాలనా? లేక తండ్రీకొడుకుల పాలనా అని కిషన్ రెడ్డి నిలదీశారు. 

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా వెలగబెట్టిన కేసీఆర్ అప్పుడేం చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పెట్రో ధరలపై కేంద్రాన్ని విమర్శించడంపై ఆయన స్పందిస్తూ పెద్ద పెద్ద దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రో రేట్లు తక్కువని చెప్పారు. కేంద్రం పన్నులను తగ్గించినా రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదని విమర్శించారు. 

దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. తెలంగాణకు ఏదైనా రాలేదంటే అది కేసీఆర్ చేతకానితనం వల్లే తప్ప వివక్షతో కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ను పొగడటం, బీజేపీని తిట్టడమే పని అన్నట్లుగా ఆ పార్టీ పార్టీ ప్లీనరీ సాగిందని దుయ్యబట్టారు. 

 కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క మాట కూడా ప్లీనరీలో మాట్లాడలేదని కిషన్ రెడ్డి  గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీలకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

దేశంలో 8 ఏండ్లలో మత ఘర్షణలు తావులేకుండా పాలన సాగించిన ఘనత బీజేపీదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు కోరిన వ్యక్తి దేశ సమగ్రత గురించి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని కేంద్ర మంత్రి కొట్టిపారేసారు