పోలీసులపై పొరపాటున నోరు జారా..  ఎమ్మెల్సీ పట్నం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాండూర్ సీసీని టెలిఫోన్లో దుర్భాషలాడినట్లు వైరల్ అయిన వీడియో పట్ల  ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎట్టకేలకు విచారం వ్యక్తం చేశారు. ఆ వీడియో తనది కాదని, కోర్ట్ లోనే తేల్చుకొంటానని ప్రకటించిన కొద్దీ గంటల తర్వాత పొరపాటున నోరుజారానని అంటూ అంగీకరించారు.

 తాండూరు సీఐను దూషించింనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆడియో క్లిప్పులతో పోలీసుల మనసు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని చెబుతూ తన వ్యాఖ్యల వల్ల పోలీసులు బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. 

కాసేపట్లో సీఐను కూడా కలవనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పోలీసు సోదరులంతా తన కుటుంబసభ్యులతో సమానమని, పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.

‘పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయయం. నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లాప్‌లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే  తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాను.  పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం’ అని గురువారం ఓప్రకటనలో తెలిపారు.

కాగా `రౌడీ షీటర్లకు కార్పెట్ వేస్తావా? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’  అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఆయన పార్టీకే చెందిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. 

దాంతో మరో కార్పెట్‌ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్‌ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్‌ ఎలా వేస్తావు?’ అని సీఐని నిలదీశారు.