ప్రధాని మోదీ పర్యటనలో కేసీఆర్ ను వద్దనలేదు!

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌ లో జరిపిన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) చెప్పిందన్న మంత్రి, కేసీఆర్ కుమారుడు  కేటీఆర్‌ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తీవ్రంగా ఖండించారు.

‘‘కేటీఆర్‌ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం. ఫిబ్రవరి 5న ప్రధాని పర్యటనలో కేసీఆర్‌ కూడా పాల్గొంటారని భావించాం. కానీ, ఆయనకు అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు సీఎం కార్యాలయం సమాచారం ఇచ్చింది’’ అని పీఎంవో సహాయ మంత్రి కూడా అయిన సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఓ ఆంగ్ల వార్తా చానెల్‌తో ప్రొటోకాల్‌ నిబంధనల ఉల్లంఘనపై మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్‌ హాజరవ్వాల్సిన అవసరం లేదని పీఎంవో నుంచి ప్రత్యేకంగా సందేశం వచ్చిందని చెప్పారు. పీఎంవో ప్రొటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదా? ఒక ముఖ్యమంత్రిని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు.

అలా ఎందుకు సందేశం ఇస్తారని అడగ్గా.. ఆ విషయం పీఎంవోనే అడగాలని సూచించారు. ప్రధాని మోదీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ విమానాశ్రయంలో స్వాగతం పలకలేదు. ముచ్చింతల్‌లో కార్యక్రమానికీ హాజరవ్వలేదు. ఆయనకు జ్వరంగా ఉండడంతో వెళ్లలేదని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు కేసీఆర్ గైరాజర్ కావడం, కనీసం  విమానాశ్రయంలో స్వాగతం పలుకక పోవడంపై విమర్శలు చెలరేగాయి. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా పిఎంఓ పైకి నెట్టివేస్తూ కేటీఆర్ పేర్కొనడం గమనార్హం. ఇలా ఉండగా, నవంబరులో ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌ సందర్శనకు వచ్చిన సమయంలోనూ కేసీఆర్‌ గైర్హాజరయ్యారు.