హింస వళ్ళ ఏ సమాజం లాభపడదు

హింస వల్ల ఏ సమాజమూ లాభపడదని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్  డా.  మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హింసను ఇష్టపడే సమాజం ప్రస్తుతం చివరి రోజులు లెక్కిస్తోందని ఆయన గుర్తు చేశారు. హింస ఎవరికీ మేలు చేయదనిపేర్కొంటూ మనం ఎల్లప్పుడూ అహింస, శాంతిని ప్రేమించేవారిగా ఉండాలని హితవు చెప్పారు.

శాంతి కోసం అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి మానవాళిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు. మనమందరం ఈ పనిని ప్రాధాన్యత ప్రాతిపదికన చేయాలని సూచించారు. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ సమూహాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి.

సంత్ కన్వర్ రామ్ మునిమనవడు సాయి రాజ్‌లాల్ మోర్దియా ‘గడ్డినాశిని’ (మతపరమైన హోదాను స్వీకరించే వేడుక) కార్యక్రమానికి హాజరయ్యేందుకు మోహన్ భగవత్ తూర్పు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని భంఖేడా రోడ్డులోని కన్వర్రం ధామ్‌కు వచ్చారు. అమరావతి జిల్లాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది సింధీ సంఘం సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.

సింధీ భాష,  సంస్కృతి ఉనికిని కాపాడి, ప్రోత్సహించడానికి  దేశంలో సింధీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భగవత్ సూచించారు. భారతదేశం బహుభాషా దేశమని చెబుతూ  ప్రతి భాషకు దాని స్వంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు.

“కొందరు సింధీ సోదరులు తమ మతం, భూమిని రక్షించుకోవడానికి పాకిస్తాన్‌లో ఉండిపోగా, చాలా మంది భూమిని వదులుకొని తమ మతాన్ని రక్షించడానికి భారతదేశానికి వచ్చారు” అని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గుర్తు చేశారు. సింధు యూనివర్శిటీ డిమాండ్‌ను నెరవేర్చేందుకు సింధీ సంఘం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉందని సూచించారు.

“సమాజం సింధీ విశ్వవిద్యాలయం, అవిభక్త భారతదేశాన్ని కలిగి ఉండాలని కోరుకుంటోంది. ఈ భావాలు ఈ వేదికపై కూడా వ్యక్తీకరించబడ్డాయి. సింధీ విశ్వవిద్యాలయం కోసం ప్రయత్నాలు చేయాలని నేను విజ్ఞప్తి చేశాను, కానీ నేను ప్రభుత్వంలో భాగం కాదు” అని తెలిపారు.

“ఈ ప్రభుత్వం అయినా, మరేదైనా సరే, అది సమాజం యొక్క ఒత్తిడిపై పనిచేస్తుంది. సామాజిక ఒత్తిడి ప్రభుత్వానికి పెట్రోల్ లాంటిది. సింధీ విశ్వవిద్యాలయం గురించి మీ కల సాకారం కావాలని మీరు కోరుకుంటే, మీరు ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ” అని భగవత్ వారికి హితవు చెప్పారు.

ప్రపంచంలోని ప్రతి రకమైన వ్యక్తుల దుష్ట ధోరణులు అంతమయ్యే ప్రాంతం భారతదేశమని సంఘ్ అధినేత చెప్పారు. ఎవరైనా అతను భారతదేశానికి వచ్చిన తర్వాత సంస్కరించబడతాడు లేదా అతని ఉనికి ముగుస్తుందని స్పష్టం చేసారు.  భారతీయ సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు 1000 సంవత్సరాలుగా నిరంతరం కృషి జరుగుతోందని పేర్కొంటూ ఆ విధంగా  ప్రయత్నించిన వారు తుడిచిపెట్టుకు పోతున్నారు, కానీ సనాతన ధర్మం ఇప్పటికీ ఉందని డా. భగవత్ గుర్తు చేశారు.

ఈ సందర్భంగా జగద్గురు శంకరాచార్య వాసుదేవానంద సరస్వతీ మహరాజ్ మాట్లాడుతూ, అవిభక్త భారతదేశం దేశం అందరి కల అని, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఈ కల కచ్చితంగా సాకారమవుతుందని భరోసా వ్యక్తం చేశారు.