స్వల్పకాలిక యుద్ధాలకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉండాలి

స్వల్పకాలిక యుద్ధాలకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉండాలి

ఆదేశించిన వెంటనే, భీకర, స్వల్పకాలిక యుద్ధాలకు భారత వాయు సేన (ఐఏఎఫ్) సిద్ధంగా ఉండవలసిన అవసరాన్ని ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు సృష్టిస్తున్నాయని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి చెప్పారు.  ఆయన ఓ సెమినార్‌లో మాట్లాడుతూ, చిన్న చిన్న ఆకస్మిక యుద్ధాలకు సిద్ధమవడం అవసరమని పేర్కొన్నారు. మరోవైపు తూర్పు లడఖ్‌లో ఏర్పడిన దీర్ఘకాలిక ప్రతిష్టంభన వంటివాటికి కూడా సిద్ధమవాలని సూచించారు.

భారత వాయు సేనకు ఇటీవల ఎదురైన అనుభవాలు, అదేవిధంగా పరిణామం చెందుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఐఏఎఫ్‌ కార్యకలాపాలపరంగా, ఆయుధ సంపత్తి, సామగ్రి వంటివాటి పరంగా అన్ని వేళలా స్పందించగలిగే స్థితిలో ఉండటాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిలవగానే అకస్మాత్తుగా భీకర, స్వల్పకాలిక యుద్ధ కార్యకలాపాలకు సిద్ధమయ్యేలా చేస్తున్నాయని చెప్పారు.

అతి తక్కువ సమయంలో సిద్దమవడానికి, అత్యంత తీవ్ర స్థాయి కార్యకలాపాలు నిర్వహించడానికి సేనలు, ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి  తరలింపు, సేనలకు బస ఏర్పాటు చేయడం వంటివాటి విషయంలో భారీ మార్పులు అవసరమని చెప్పారు.

ఐఏఎఫ్‌కు అత్యంత విస్తృతమైన, వైవిద్ధ్యభరితమైన ఆయుధ సంపత్తి, సామగ్రి ఉన్నందువల్ల వాటి తరలింపు సవాళ్లతో కూడుకున్నదని ఆయన వివరించారు. వనరుల లోటును భర్తీ చేసుకోవాలని, రవాణా సదుపాయాలను పటిష్టపరచుకోవాలని పేర్కొన్నారు.

స్వయం సమృద్ధ భారత్ పథకం విజయవంతమవడం కోసం అన్ని ముఖ్యమైన భాగాలను దేశీయంగానే అభివృద్ధిపరచుకోవడం కోసం ప్రత్యేక చర్యల ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి అవసరమైన ముఖ్యాంశాల్లో లాజిస్టిక్స్ ఒకటి అని గుర్తించినట్లు తెలిపారు.