భాగ్యలక్ష్మీ, బైంసా, ఉట్కూర్ గ్రామాలను దత్తత తీసుకుంటా

తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయ, బైంసా, ఊట్కూర్ ప్రాంతాలను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఉట్కూరులో పోలీసుల చిత్రహింసలకు గురై అనేక కేసులతో ఇబ్బంది పడుతున్న యువకులను ఆదుకోవడంతోపాటు వారికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. 
 
ప్రజా సంగ్రామ యాత్ర 14వ రోజు బుధవారం సాయంత్రం ఉట్కూర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  ఉట్కూర్, బైంసాలో హిందువులను చిత్రహింసలు పెట్టిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్త లేదని స్పష్టం చేశారు. వారు ఎక్కడున్నా రప్పించి ప్రజాస్వామ్య, చట్ట బద్దంగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 69 జీవోను అమలు చేసి ఉట్కూర్ సహా మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
ఊట్కూర్ యువత చత్రపతి శివాజీ వారసులని పేర్కొంటూ వినాయక నిమజ్జనం రోజు ఊట్కూర్లో జరిగింది వింటే గుండె తరుక్కపోతుందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఊట్కూర్, భైంసాల కోసమే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని స్పష్టం చేశారు.
నిఖార్సయిన హిందువునని బూతు పేపర్​లో ప్రకటనలు వేయించుకున్న సీఎం.. రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊట్కూర్ వినాయక నిమజ్జనంలో జరిగిన ఘటనపై 100 మంది సేవకులు, 30 మంది హిందూ యువకులపై రౌడిషీట్​లు ఉన్నయంటే సమాజం ఆలోచించాలని సంజయ్ కోరారు. 

69 జీవోను అమలు చేస్తే మొట్టమొదట నిండేది ఉట్కూరు చెరువే అని చెబుతూ  దీంతో 15 గ్రామాలకు సాగు నీళ్లందుతాయని తెలిపారు. నిజాం కాలంలో రజాకార్లు చేసిన అరాచకాలు తెలుసు… కానీ కేసీఆర్ పాలనలో పోలీసులు ఉట్కూర్ హిందువులను, మహిళలను రాచిరంపాన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చిత్రహింసలు పెట్టారని చెబుతూ  గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. 
ఈ ఊట్కూర్ వేదికగా చెబుతున్నా… పోలీసులారా.. ఇక్కడి హిందువులను వేధించొద్దని కోరుతున్నా. ఇకపై ఒక్క లాఠీదెబ్బ పడినా నేనే స్వయంగా ఉట్కూర్ వస్తా.. వాళ్ల సంగతి చూస్తా అని హెచ్చరించారు.  ఉట్కూర్ అభివ్రుద్ది కోసం తనఎంపీ లాడ్స్స్ నుండి రూ. 5 లక్షలు ప్రకటించారు. అట్లాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం ఎంపీ లాడ్స్ నుండి మరో రూ.5 లక్షలు ప్రకటించారు.

వందలాది పేదల బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ  తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ధ్వజమెత్తారు. గరీబోళ్లు అల్లాడుతున్నరని చెప్పారు.  కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొంటూ  రేషన్ బియ్యం సహా గ్రామాల్లో అమలవుతున్న అభివ్రుద్ధి పథకాలన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతో చేపడుతున్నవే అని సంజయ్ స్పష్టం చేశారు.
బీజేపీ ఈ విషయాలన్నీ వివరిస్తూ ప్రజలను చైతన్యం తీసుకొస్తుంటే… కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొంటూ  బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్, ఎంఐఎంతో కేసీఆర్ కుమ్కక్కైండని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ గుంట నక్కల పార్టీలు కలిసినా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తుందని సంజయ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. గరీబోళ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం అని భరోసా వ్యక్తం చేశారు.