పి కె ఎరువుల సబ్సిడీ రూ 60,939 కోట్లు

కేంద్ర ప్రభుత్వం రూ 60,939 కోట్ల ఎరువుల సబ్సిడీపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో రైతాంగం మేలుకు డిఎపి సహా ఫాస్పేటిక్, పోటాసిక్ ఎరువులకు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి ఈ మొత్తాన్ని (రూ 60,939.23 కోట్లు) సబ్సిడీగా సమకూర్చే నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 

బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. రైతాంగానికి భూసారాలను అందుబాటు ధరలలో అందించడానికి వీలుగా ఈ ఎరువుల సబ్సిడీ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఈ రెండు రకాల ఎరువులను పి అండ్ కె ఫర్టిలైజర్స్‌గా పిలుస్తారు. వీటికి పౌష్టికత ప్రాతిపదికన సబ్సిడీని కల్పించినట్లు ఆ తరువాత అధికారిక ప్రకటనలో తెలిపారు. 

ఎప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ సాగే ఖరీఫ్ సీజన్‌కు ఈ పికె ఫర్టిలైజర్స్ సబ్సిడీ ధరలకు అందేందుకు వీలేర్పడుతుంది. కేంద్రం దేశీయ ఎరువుల మద్ధతు (ఎస్‌ఎస్‌పి)ను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఎరువుల రవాణ ఇతరత్రా సబ్సిడీలు ఉంటాయి. ఈ విధంగా దేశంలో ఉత్పత్తి అయ్యే ఎరువులకు, దిగుమతుల కోటాకు సబ్సిడీలు ఉంటాయి.

మంత్రివర్గ కీలక నిర్ణయాన్ని ఆ తరువాత సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపితే ఈ ఎరువులకు సబ్సిడీ దాదాపు 57,150 కోట్లు వరకు ఉంది . ఇప్పుడు 202223 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఈ సబ్సిడీ మొత్తం రూ 60, 939 కోట్లు అని మంత్రి వివరించారు.

ఇప్పుడు రైతులకు డిఎపి ఎరువులపై సబ్సిడీని పెంచారు. బ్యాగ్ ఒక్కింటికి రూ 2501 సబ్సిడీ ఉంటుంది. దీనితో రైతులు వీటిని బ్యాగ్ ఒక్కటి రూ 1,350కు పొందవచ్చు. డిఎపి బ్యాగ్ ఎరువు ధర రూ 3851గా ఉంది. 2020-21లో సబ్సిడీ బ్యాగుకు రూ 512 వరకూ ఉంది. ఇప్పుడు సబ్సిడీని ఏకంగా అయింతలు పెంచారు. ఈ విధంగా ఈ సబ్సిడీ విలువ ఇప్పుడు రూ 2501 గా నిలిచిందని మంత్రి వివరించారు.

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కు రూ 820 కోట్లు 

”ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటు”పై సవరించిన వ్యయ అంచనాకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 2022-23 వరకు రూ.820 కోట్ల అదనపు నిధులు ఇవ్వడంతో, మొత్తం అంచనా వ్యయం రూ. 2,255 కోట్లకు చేరింది. రెగ్యులేటరీ అవసరాలను తీర్చడానికి ఈక్విటీ ఇన్ఫ్యూషన్‌గా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపిపిబి) ఏర్పాటు కోసం ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.1,435 కోట్ల నుండి రూ.2,255 కోట్లకు సవరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రెగ్యులేటరీ అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం కోసం రూ.500 కోట్ల మేరకు భవిష్యత్‌ నిధుల ఇన్ఫ్యూషన్‌ కోసం మంత్రిమండలి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్‌లలో ఐపిపిబి దాదాపు 95.71 లక్షల ఖాతాలను తెరిచిందని, ఇందులో రూ.19,487 కోట్ల విలువైన 602 లక్షల మొత్తం లావాదేవీలు జరిగాయని పేర్కొంది. లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌ట్రీమిజం (ఎల్‌ డబ్ల్యుఈ) జిల్లాల్లో ఐపిపిబి ద్వారా 67.20 లక్షల ఖాతాలు తెరవబడ్డాయని, ఇవి రూ.13,460 కోట్ల విలువైన 426 లక్షల మొత్తం లావాదేవీలను కలిగి ఉన్నాయని తెలిపింది.

డిసెంబర్‌ వరకు పిఎం ఎస్‌ విఎనిధి

కాగా, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి (పిఎం ఎస్‌ విఎనిధి)ని మార్చి 2022 తర్వాత డిసెంబర్‌ 2024 వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రుణ మొత్తం రూ.8,100 కోట్లు అవుతుంది. తద్వారా వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు, వారిని ఆత్మనిర్భర్‌గా మార్చడానికి వర్కింగ్‌ క్యాపిటల్‌ను అందించబడుతుంది.