ఏపీలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలలో ప్రశ్నపత్రాల లీక్ కలకలం రేపుతున్నది.  తొలిరోజే ప్రశ్నాపత్రం లీకైందన్న కలకలం చెలరేగింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె పరీక్ష కేంద్రంలో పది పరీక్ష ప్రశాుపత్రం లీకైనట్లు ప్రచారం సాగింది.
రెండో రోజు, గురువారం,  శ్రీకాకుళంలో సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షలంత్రి సెంటర్ల నుంచి హిందీ పేపర్ బయటకి వచ్చింది. వాట్సాప్‌లలో క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొడుతుండటం కలకలం రేపుతోంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పేపర్ బయటికి వచ్చింది.
 
తొలిరోజు కావాల‌నే, ప‌థ‌కం ప్ర‌కారం క్వ‌శ్చ‌న్‌పేప‌ర్ లీక్ చేశార‌ని ద‌ర్యాప్తులో తేలింది. దీంతో తొమ్మిది మంది టీచ‌ర్లను బాధ్యులుగా చేస్తూ పోలీసులు వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు.  అంకిరెడ్డి పల్లె జడ్పీ హైస్కూల్ లో పది ప్రశ్నాపత్రం లీకేజీ వెనక కొన్ని ఎనిమిది మంది జడ్పిహెచ్ఎస్ స్కూళ్ల తెలుగు టీచర్ల తో పాటు ప్రైవేట్ స్కూళ్ల హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది.
తొలిరోజు తెలుగు పరీక్ష జరుగగా, పరీక్ష ప్రారంభమైన కొద్ది సమయానికే ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. ఫేస్‌బుక్‌, వాట్స్‌పలలో చక్కర్లు కొట్టింది. నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ప్రశ్నపత్రం లీక్‌ అవగా, సోషల్‌మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. 
 
కృష్ణాజిల్లా తామర జడ్పీ హైస్కూల్‌లోనూ పేపర్‌ లీకైనట్లు ఆ జిల్లా నుంచి వెంకటేష్‌ అనే వ్యక్తి చిత్తూరు విద్యాశాఖ ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీన్ని అధికారులు రికార్డు చేశారు. పూర్తిస్థాయి విచారణ చేస్తే కానీ వాస్తవాలు బయటకు రావంటున్నారు
ఈ విషయంలో కర్నూల్ జిల్లాలో ఇప్పటికే తొమ్మిది మంది ఉపాధ్యాయుల హస్తం ఉన్నట్లు తేలడంతో వారిపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డి.ఎస్.పి రాజేంద్ర రెడ్డి వెల్లడించారు.
తొలుత ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు (డిజిఇ) డి దేవానందరెడ్డి ప్రశ్నాపత్రం లీక్ వార్తను ఖండించారు.  అంకిరెడ్డిపల్లె పరీక్ష కేంద్రంలోకి వాటర్‌ బాయ్ గా వచ్చిన విద్యార్థి రూమ్‌ నెంబరు-3లోకి వెళ్లి విద్యార్థిని నుంచి ప్రశ్నాపత్రాన్ని తీసుకుని ఫోన్లో ఫొటో తీసి బయటి వ్యక్తులకు చేరవేశాడు. సోషల్‌ మీడియాలో లీకైన ప్రశ్నాపత్రంపై విస్తృతంగా చర్చ జరగడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
 ప్రాథమిక విచారణకు ఆదేశించిన డిఇఒ అక్కడ విధుల్లో ఉన్న డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌ రామకృష్ణారెడ్డిని, చీఫ్‌ సూపరింటెండెంటు సుధాకర్‌ గుప్తా, ఇన్విజిలేటర్‌ వీరేశ్‌ను వెంటనే సస్పెండ్‌ చేస్తూ మండల విద్యాశాఖ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాుపత్రం లీక్‌ కావడం పట్ల పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.
అయితే, ఇది ప్రశాుపత్రం లీక్‌ కింద రాదని, మాల్‌ ప్రాక్టీస్‌ కింద వస్తుందని డిజిఇ దేవానందరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఒఎంఆర్‌ షీట్‌లో వివరాల మేరకు ఫొటో తీసినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత 11:35 గంటలకు తెలుగు పేపర్‌ వాట్సాప్‌లో వచ్చిందని వివరించారు. బుధవారం జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6,15,398 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.