2 నుంచి 4 వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల (మే) 2 నుంచి 4 వ తేదీ వరకూ విదేశీపర్యటనకు వెళ్లుతున్నారు. ఆయన జర్మనీ, డెన్మార్క్‌లలో మూడు రోజుల పర్యటనకు వెళ్లుతున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఇదే తొలిసారి. 
 
వివిధ రంగాలలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశలో ప్రధాని అక్కడికి వెళ్తున్నారు. ముందు ఆయన జర్మనీకి వెళ్లి అక్కడి నుంచి డెన్మార్‌క వెళ్లుతారు. తిరుగు ప్రయాణంలో మే 4న ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో కొద్ది సేపు భేటీ అవుతారు. 
 
సోమవారం ప్రాన్స్ అధ్యక్షులుగా తిరిగి మెక్రాన్ ఎన్నికయ్యారు. జర్మనీలో ఆరవ ఇండియా జర్మనీ ప్రభుత్వ అంతర్ సంప్రదింపుల ప్రక్రియ (ఐజిసి)లో పాల్గొంటారు. జర్మనీ దేశాధ్యక్షులు ఒలాఫ్ స్కోలోజ్‌తో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఐజిసికి ఇద్దరు నేతలు సహ సారధ్యం వహిస్తారు.
కోపెన్‌హాగన్ లో డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాల ప్రధానమంత్రులతో మోదీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.