
చిన్నారులకు కరోనా టీకా పంపిణీ విస్తృతిని పెంచేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) మరో రెండు టీకాలకు అత్యవసర అనుమతులు జారీచేసింది. దీంతో దేశవ్యాప్తంగా చిన్నారులకు టీకా పంపిణీ వేగవంతం కానుంది. హైదరాబాద్‌కు చెందిన ఔషధసంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను 6-12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇవ్వడానికి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా, 5-12 ఏళ్ల వారికి బయోలాజికల్ ఇ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా పంపిణీకి కూడా అనుమతులిచ్చింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. కోవాగ్జిన్ టీకాను ఇప్పటికే 12ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. దీన్ని చిన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు అనుమతి కోరుతూ భారత బయోటెక్ ఇదివరకే దరఖాస్తు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను అందజేసింది.
5-12 వయసు చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకా పంపిణీ కోసం బయోలాజికల్ సంస్థ కూడా దరఖాస్తు చేసుకుంది. వీటి సమాచారాన్ని, ప్రయోగ పరీక్షల ఫలితాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ ఈ రెండు టీకాలను అత్యవసర వినియోగానికి అనుమతించొచ్చని డీసీజీఐకి సిఫార్సుచేసింది.
అయితే ఇందుకు ఇందుకు కొన్ని షరతులు విధించింది. టీకా పంపిణీ మొదలైన తర్వాత తొలి రెండు నెలల పాటు ప్రతి 15 రోజులకోసారి భద్రతా డేటాను అందజేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 5 నెలల పాటు నెలకోసారి ఈ వివరాలను ఇవ్వాలని సూచించింది.
ఇదిలావుండగా, 5 ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చే టీకాలకు అత్యవసర అనుమతులు లభించిన నేపథ్యంలోనే త్వరలోనే ఈ వయసు వారికి వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 12 ఏళ్లు పైబడిన పిల్లలకు జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకా పంపిణీకి కూడా డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.
ప్రస్తుతం 12-18ఏళ్ల వారి కోసం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాను 15-18 ఏళ్ల వయసువారికి పంపిణీ చేస్తున్నారు. 12-14 ఏళ్ల పిల్లలకు ఇస్తున్న కార్బెవాక్స్ మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లోనే ఉందుబాటులో ఉంది.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం