టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నారని, కేసీఆర్ డైరక్షన్ లోనే సంజయ్ పనిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. రేవంత్… జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా? అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా ? అని ఆమె సవాల్ చేశారు. 

టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, వాళ్లద్దరూ కుమక్కై మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయబోతున్నరని అంటూ అరుణ ప్రత్యారోపణలు చేశారు. ప్రశాంత్ కిశోర్ (పీకే) సాక్షిగా టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం చేసుకుంటున్నయని ఆమె ఆరోపించారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక ఈ కుమ్మక్కు రాజకీయాలకు దిగుతున్నారని అరుణ ధ్వజమెత్తారు.

బండి సంజయ్ చేపడుతుతున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆమె విమర్శించారు. రాళ్లు విసిరి, అలజడి సృష్టించి  పాదయాత్రను ఆపాలనుకున్న టీఆర్ఎస్ నాయకులు యాత్రకు వస్తున్న స్పందనను చూశాక దిక్కుతోచక అడ్డగోలుగా మాట్లాడుతున్నరని ఆమె మండిపడ్డారు.

వాళ్లు వాడుతున్న భాష, పద్దతిని చూసి జనం ఛీదరించుకుంటున్నరని, కేటీఆర్ వాడుతున్న భాష జుగుప్పాకరంగా ఉందని అరుణ మండిపడ్డాయిరు. ఎడమ కాలి చెప్పుతో పదవిని తన్నేస్తానని కేటీఆర్ చెబుతున్నారని, కానీ ఆ పదవి కోసమే మీరు అడ్డమైన గడ్డి తింటున్నారని ఆమె ధ్వజమెత్తారు.  వేలాది కోట్లు దోచుకుని ఓట్లను కొనాలనుకుంటున్నది ఎందుకు? అని అరుణ ప్రశ్నించారు.

 రెండు పార్టీలు కలసి మునుగుతున్నాయి
 
 కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే..ఈ రెండు పార్టీలు కలసి మునగబోతున్నాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్యెల్సీ ఎన్  రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. ‘‘అక్కడ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీఆర్ఎస్‌కి ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్‌కే అప్పగించింది. టీఆర్ఎస్‌ను పొత్తుపై ఒప్పించే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తున్నాడు” అని గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్‌తో కలవబోతే బీజేపీ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్‌ను పీకే ఒప్పిస్తున్నాడని పేర్కొంటూ ఎన్నికల తర్వాతా లేదా ముందా ఈ కలయిక అన్నది తెలియవలసి ఉందని చెప్పారు.  ఏదేమైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ కలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఐప్యాక్ కాంగ్రెస్‌కు పనిచేస్తుంది టీఆర్ఎస్‌కు పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్‌కు ఐప్యాక్ పనిచేస్తుందని తెలిపారు. 
 
మమతా బెనర్జీ, జగన్మోహన్‌రెడ్డి, ములాయం సింగ్…  వీళ్లంతా ప్రశాంత్ కిషోర్ క్లైంట్స్.  ప్రశాంత్ కిషోర్ మాకైనా సలహాదారుగా ఉండాలి లేదా టీఆర్ఎస్‌కు  అయినా సలహాదారునిగా ఉండమని  దమ్ముంటే కాంగ్రెస్ వారిని చెప్పమనండి అంటూ సవాల్ చేసారు.  వారికి చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే వారు ఇద్దరు ఒక్కటే అని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు.