సీఎంలతో ప్రధాని మోదీ కరోనా సమీక్ష నేడే!

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ  బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ సమావేశం జరగనుంది. వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. 
 
ఈ కాన్ఫరెన్స్‌లో ప్రస్తుత కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 2 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సమావేశం కానున్నట్లు రాజేష్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్రియా శీలక కేసులు 15వేలు దాటాయి. 
 
కాగా, ఇటీవల జరిగిన మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ రంజాన్‌, అక్షయ తృతీయతో పాటు పలు పండుగల నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు.

 86% మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి

ఇలా ఉండగా, దేశంలో 86% మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తైందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 86% మంది పెద్దలకు రెండు వ్యాక్సిన్ల డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
కరోనా  వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు 187 కోట్ల 95 లక్షల టీకాలు వేశారు. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగా 2 వేల 483 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కేంద్రం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 192 కోట్ల 85 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 19 కోట్ల 90 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి.
 మరోవంక, దేశంలో స్వల్ప హెచ్చుతగ్గుదలతో కొత్తకేసులు స్థిరంగా ఉంటున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,49,197 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,483 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.55శాతంగా ఉంది. తాజాగా 1970 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 15,636కి దిగొచ్చాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల రేటు 0.04శాతంగా ఉంది. తాజాగా మరో 399 కరోనాతో మరణించారు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో మరణాల సంఖ్యను సవరించడంతో మృతులు పెరిగినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
ఇటీవల రోజువారి కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఢిల్లీతోపాటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలు మాస్క్‌ నిబంధన లను అమల్లోకి తెచ్చాయి. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నాయి.