కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ తిరస్కారం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి కొద్దీ కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆయన నేడు తెరదించారు.  పార్టీలో చేరాలంటూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. కాంగ్రెస్‌లో చేరబోనని స్పష్టం చేశారు.  కేవలం కాంగ్రెస్‌కు సలహాదారుడిగా మాత్రమే కొనసాగుతానని తెలిపారు. 
 
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ  నేపథ్యంలో వెలువడిన ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఆయనకు ఎటువంటి హోదా ఇవ్వాలనే విషయమై సోనియా గాంధీ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి, విస్తృతంగా చర్చించారు. 
 
మూడు దఫాలు కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించిన ప్రశాంత్ కిశోర్  2024 సాధారణ ఎన్నికల ప్రణాళికను కూడా పార్టీ పెద్దలకు అందించారు. ఈ సందర్భంగా పార్టీలో సంస్థాగతంగా తీసుకు రావలసిన మార్పుల గురించి కిషోర్ చేసిన సూచనలు అనేకం పార్టీలో పలువురికి సంతృప్తికరంగా లేవని తెలుస్తున్నది. 
 
అదే విధంగా కాంగ్రెస్ లో చేరాక ఇతర పార్టీలకు ఆయన  గాని, ఆయన సంస్థ గాని ఎన్నికల వ్యూహాల గురించి  సలహాలు ఇవ్వరాదని నిబంధనకు ప్రశాంత్ సుముఖంగా లేరని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ నేతలు వెంటనే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధంగా లేకపోవడం కూడా కిషోర్ కు కాంగ్రెస్ లో చేరడానికి సమస్యలు సృష్టించినట్లు తెలుస్తున్నది.