ప్రశాంత్ కిషోర్ పై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ల్లో గందరగోళం!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరేందుకు ఒక వంక రంగం సిద్ధం అవుతూ ఉండగా, మరోవంక తెలంగాణాలో ఆయన సహాయంతో ఎన్నికలకు వెళ్లి, మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు గందరగోళంకు గురవుతున్నారు.
మరోవంక, టీఆర్‌ఎస్‌ తో పొత్తు పెట్టుకోవాలని కిషోర్ స్వయంగా సోనియా గాంధీకి సూచించారని, ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నామని కధనాలు రావడం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గాలకు కలవరం కలిగిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో సమావేశాలు జరుపుతూనే, గత శని, ఆదివారాలలో హైదరాబాద్ కు వచ్చి, ప్రగతి భవన్ లో మకాం వేసి, కేసీఆర్ తో సుదీర్ఘంగా మంతనాలు జరపడం ఆ పార్టీ వారికి మింగుడు పడటం లేదు. 
 
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరినా, ప్రశాంత్ కిశోర్ )కు చెందిన ఐప్యాక్ సంస్థ సేవలు కొనసాగించాలని నిర్ణయించినట్లు టిఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. అంటే కాంగ్రెస్ నేతగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ను ఓడించే వ్యూహాలపై కసరత్తు చేస్తూ, తన సంస్థద్వారా ఆ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలని కృషి చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాదు, ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సూత్రప్రాయంగా రంగం సిద్దమైనదనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 
 
ఈ విషయమై, కిషోర్ బైటకు ఏమీ చెప్పక పోయినా, ఇక సేవలు అందించలేనని చెప్పడం కోసమే వచ్చి కేసీఆర్ ను కలిసారని, త్వరలో తనతో కలసి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడతారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే నిజమైతే `వీడ్కోలు’ చెప్పేందుకు రెండు రోజులు కేసీఆర్ తో గడపవలసి అవసరం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. 
 
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని, అవి రెండూ ఒకటేనని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె  లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఆ రెండు పార్టీలకు పీకే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి దాకా కాంగ్రెసేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్పీ కే రాకతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని చెప్పారు.
ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ కలిసి పని చేసేలా పీకే వ్యూహాలు పన్నుతున్నారని చెబుతూ,  అందులో భాగంగానే టీఆర్ఎస్ తో కాంగ్రెస్ దోస్తీ కట్టనుందని స్పష్టం చేశారు. అయితే కేసీఆర్, పీకే వ్యూహాలు ఇక తెలంగాణలో పనిచేయబోవన్న ఆయన కేసీఆర్ గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావు తెలిపారు. “తాజాగా  సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ మధ్య జరిగిన భేటీ, ఆ తర్వాత ప్రకటనలు కేసీఆర్, సోనియాగాంధీ మధ్య పొత్తు ఖాయమని తేలిపోయింది” అని ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కూటమిపై బీజేపీ పోటీ చేయనుందని పేర్కొంటూ 1+1 సున్నాగా మారుతుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని ఎద్దేవా చేశారు. ఈ అవినీతి, అవకాశవాద కూటమిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారు ? రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌తో జతకట్టేందుకు కాంగ్రెస్‌కు సహకరిస్తారా? అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ బహుళ పార్టీలు, సిద్ధాంతాల దీర్ఘకాల సరసుడు అని నేను పేర్కొంటూ అతను అస్థిరమైన అంశం, ఏదైనా ఒక భావజాలానికి విధేయుడిగా ఉండటం అసాధ్యం అని కృష్ణ సాగర్ రావు తెలిపారు.
 
2024లో భారత ప్రతిపక్ష పార్టీల అజెండాకు ప్రశాంత్ కిషోర్ చివరి మజిలీ కాగలదని అంటూ  టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ బీజేపీ వచ్చే ఎన్నికల్లో సమరానికి ఇప్పటికే సిద్ధమైందని స్పష్టం చేశారు.