బీజేపీని ఎదుర్కోలేక టీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తు

రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పొత్తుకు సిద్దమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.  రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు 25 నుండి 30 సీట్లు కేటాయించబోతున్నారని వెల్లడించాయిరు. బీజేపీ అంటే భయం పట్టుకున్న కేసీఆర్  పీకేను పిలిపించుకుని మంతనాలు జరుపుతున్నారని తెలిపారు.

 ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 12వ రోజు మక్తల్ మండలంలో పాదయాత్ర చేసిన సంజయ్ మక్తల్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే అధికార టీఆర్‌ఎస్‌ కుటిల యత్నాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎం ఇతర పార్టీలతో జట్టు కడుతోందని చెప్పారు. 
 
“అయినా మేం తెలంగాణలో పాగా వేసి తీరుతాం” అంటూ భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినా తెలంగాణ అభివృద్ధి చెందలేదు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలారా ఇదే చివరి యుద్ధం కావాలని పిలుపిచ్చారు. 
కాంగ్రెస్ లో గెలిచే నాయకుడు అమ్ముడు పోతడు, ఓడిపోయే నాయకుడు కాంగ్రెస్ నే అమ్మేస్తాడని సంజయ్ హెచ్చరించారు. ఏనాడూ బీజేపీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదని, పొత్తు పెట్టుకోలేదని చెబుతూ టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రతిపక్ష పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ఒకనాడు 2 ఎంపీ స్థానాలున్న బీజేపీ ఈనాడు 303 ఎంపీ స్థానాలతో దేశంలో తిరుగులేని విజయం సాధించిందని గుర్తు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు టీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలని నిలదీస్తూ ఒక్క ప్రాజెక్టునైనా కట్టినవా? అని సంజయ్ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 69 జీవో పేరు తీసి రూ.1400 కోట్లతో కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని చూసారని గుర్తు చేశారు.
అయితే,  కేసీఆర్ వచ్చాక పాలమూరు-రంగారెడ్డి పేరుతో అంచనాలను రూ.70 వేల కోట్లకు పెంచి కమీషన్లను ఎత్తిపోసుకోవాలనుకున్నారని ధ్వజమెత్తారు.  కాళేశ్వరం ప్రాజెక్టును సైతం లక్షా 20 వేల కోట్లు ఖర్చు పెట్టి తన ఫాంహౌజ్ కు మాత్రమే నీళ్లు తెచ్చుకుని వేల కోట్ల కమీషన్లు దోచుకుతిన్నారని ఆరోపించారు.  బీజేపీ చేసిన ఉద్యమంతోనే కేసీఆర్‌ ప్రగతి భవన్‌ దాటి బయటకు వచ్చారని, ధర్నాచౌక్‌ను తెరిచారని సంజయ్ స్పష్టం చేశారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రమే టీఆర్‌ఎస్‌ది అని.. స్టీరింగ్‌ మాత్రం ఎంఐఎం చేతుల్లో ఉందని విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 48 సీట్లు, ఉపఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచాక కేసీఆర్‌కు భయం మొదలైందని ఆమె పేర్కొన్నారు. కేంద్రంలోనే కాదు.. రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె చెప్పారు.