రెండింతలు పెరిగిన ముడి చమురు దిగుమతులు

ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశ ముడి చమురు దిగుమతులు రెండింతలు పెరిగాయి. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొనడంతో దేశ ఆయిల్ దిగుమతుల విలువ 2021–22 లో రెండింతలు పెరిగి 119 బిలియన్ డాలర్ల (రూ. 9,04,400 కోట్ల) కు చేరుకుంది. 

పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్‌‌‌‌ సెల్‌‌‌‌ (పీపీఏసీ) విడుదల చేసిన డేటా ప్రకారం, దేశ చమురు దిగుమతుల విలువ 2020–21 లో 62.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచలోనే ముడి చమురును ఎక్కువగా వాడుతున్న మూడో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ముడి చమురు ధరలు ఈ ఏడాది మార్చిలో 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. 

ఈ ఒక్క నెలలోనే ముడి చమురు కోసం ఏకంగా 13.7 బిలియన్ డాలర్లను భారత్ ఖర్చు చేసింది. కిందటేడాది మార్చి నెలలో 8.4 బిలియన్ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకున్నాం. బ్రెంట్ క్రూడాయిల్ (బ్యారెల్‌‌‌‌) రేటు ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి పెరగడం ప్రారంభమై,  మార్చి మొదటి వారంలో 140 డాలర్ల వద్ద ఆల్‌‌‌‌టైమ్ హైని టచ్ చేసింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ రేటు 106 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.  

పీపీఏసీ డేటా ప్రకారం, 2021–22 లో 212.2 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్  దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో  ఈ సంఖ్యా 196.5 మిలియన్‌‌‌‌ టన్నులుగా రికార్డయ్యింది. కాగా, ఈ సారి కరోనా ముందు స్థాయిల కంటే తక్కువ చమురునే మనం దిగుమతి చేసుకున్నాం. కానీ, చమురు ధరలు పెరగడంతో ఎక్కువ మొత్తాన్ని దిగుమతుల కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది.

2019–20 లో 227 మిలియన్‌‌‌‌ టన్నుల ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకోగా, ఇందుకోసం 101.4 బిలియన్ డాలర్లనే భారత్ ఖర్చు చేసింది. ముడి చమురును రిఫైనింగ్ చేసి కొన్ని పెట్రోలియం ఉత్పత్తులను ఇతర దేశాలకు కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. కానీ, ఎల్‌‌‌‌పీజీ గ్యాస్‌‌‌‌ కోసం మాత్రం దిగుమతులపై ఆధారపడుతోంది.

2021–22 లో మొత్తం 202.7 మిలియన్‌‌‌‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను దేశంలో వినియోగించారు. పీపీఏసీ డేటా ప్రకారం, 2021–22 లో 24.2 బిలియన్ డాలర్ల విలువైన 40.2 మిలియన్ టన్నుల పెట్రోల్ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంది. అదేవిధంగా 42.3 బిలియన్ డాలర్ల విలువైన 61.8 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది.

దీనికి అదనంగా 32 బిలియన్ క్యూబిక్ మీటర్ల  ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ గ్యాస్ కోసం 11.9 బిలియన్ డాలర్లను 2021–22 లో ఖర్చు చేసింది. ఎగుమతులను కూడా కలుపుకుంటే నికరంగా ఆయిల్ అండ్ గ్యాస్ దిగుమతుల బిల్లు  113 బిలియన్ డాలర్ల (రూ. 8.58 లక్షల కోట్ల) కు పెరిగింది. 2020–21 లో ఈ బిల్లు 92.7 బిలియన్ డాలర్లుగా ఉంది.