హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ నేతలను చెట్టుకు కట్టేసి నిలదీయండి

“ఈసారి టీఆర్ఎస్ నేతలు మీ వద్దకు వస్తే చెట్టుకు కట్టేయండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీయండి. ఆ రోజు మీరు అరిచే అరుపులకు టీఆర్ఎస్ నేతల చెవుల్లోనుండి రక్తం కారాలే…’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపిచ్చారు. 
 
9వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం శెట్టి అత్మకూర్ స్టేజీ నుండి జూరాల మీదుగా నందిమల్ల గ్రామం వరకు మొత్తం 17 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యలే. ఉద్యగాలియ్యలే. నిరుద్యోగ భ్రుతి ఇయ్యలే. దళితులకు మూడెకరాలు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతడంత అయితదని చెప్పారు. 
 
పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మదనపల్లి స్టేజీ, ఈడిగొని పల్లి స్టేజీ వద్ద పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి సంజయ్ కు స్వాగతం పలికారు. ఈడిగొని పల్లి స్టేజీ తర్వాత మున్నూరు కాపు సంఘం సంజయ్ కు ఘనంగా సన్మానించింది. పెద్ద పాడులో  వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి సంఘం సన్మానం వినతిపత్రం అందజేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగించారు.
ఈ సందర్భంగా చింత రేవులలో ‘‘జనం గోస – బీజేపీ భరోసా’’ పేరిట నిర్వహించిన గ్రామసభలో స్థానికులు హాజరై తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఫించన్ రావడం లేదని కొందరు, ఇండ్లు మంజూరు కాలేదని ఇంకొందరు, తమకు ప్రభుత్వం నుండి ఏ పథకం కూడా అందడం లేదని ఇంకొందరు సంజయ్ ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా చింతరేవుల ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
 ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల రక్తం తాగుతూ వేల కోట్ల రూపాయలు దోచుకుతింటున్నడని మండిపడుతూ   పేదలంటే ఆయనకు చులకన, ఎన్నికలొస్తే డబ్బులిస్తే వాళ్లే ఓట్లేస్తారనే అహంకారం ఉందని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు.  గద్వాల్ జిల్లాలో అకాల వర్షాలతో, నకిలీ విత్తనాలతో మిర్చి, పత్తి పంట దెబ్బతిని రైతులు నష్టపోయినా కేసీఆర్ నయా పైసా సాయం చేయలేదని ధ్వజమెత్తారు.

ఎన్నికలొస్తే ఊరిలో గట్టిగా ప్రశ్నించే వాళ్లలో ఒక్కరికి దళిత బంధు పథకం మంజూరు చేస్తున్నట్లు పేపర్ చూపించి అందరినీ మోసం చేసి ఓట్లేయించుకోవాలనుకుంటడని హెచ్చరించారు. కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని హితవు చెప్పారు.  గ్రామ పంచాయతీలకు మంజూరు చేసే నిధులన్నీ కేంద్రానివే  స్పష్టం చేస్తూ  గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్ని కేంద్రం ఇచ్చిన నిధులతో చేసినవే అని చెప్పారు.

తెలంగాణకు నిధులిచ్చేవాడు నరేంద్రమోదీ… కానీ వడ్డించే వాడు కేసీఆర్ కావడంవల్ల ఆ నిధులేవీ ప్రజలకు చేరడం లేదని,  పథకాలేవీ మీకు అందడం లేదని తెలిపారు. అందుకే నిధులిచ్చే పువ్వు పార్టీయే రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి రావాలని, అప్పుడే పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.

 బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డాక్టర్ సహా ఎంత పెద్ద విద్యనైనా ఫ్రీగా అందిస్తాం. ఎంత ఖర్చైనా భరిస్తాం అని హామీ ఇచ్చారు.  పేదలకు ఎంత పెద్ద రోగమొచ్చినా రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పారు.